calender_icon.png 24 August, 2025 | 5:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌కు రండి

24-08-2025 12:54:01 AM

- ఓపెన్ ఏఐ కార్యక్రమాలు ప్రారంభించండి

- కంపెనీ సీఈవో ఆల్ట్‌మన్‌కు కేటీఆర్ విజ్ఞప్తి

- అన్ని సదుపాయాలు హైదరాబాద్‌లో ఉన్నయ్

హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): ఓపెన్ ఏఐ కంపెనీ తన కార్యకలాపాలను హైదరాబాద్‌లో ప్రారంభించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. శనివారం ట్విట్టర్ వేదికగా ఓపెన్ ఏఐ సంస్థ సీఈవో సామ్ అల్ట్‌మన్‌కు విజ్ఞప్తి చేశారు. భారత్‌లో తమ కార్యాలయం ఏర్పాటు చేస్తామని అల్ట్‌మన్ ఇటీవల తెలిపారు. సెప్టెంబర్‌లో ఇక్కడ పర్యటిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో కేటీఆర్ ఆయనకు స్వాగతం పలికారు.

ఓపెన్ ఏఐ కార్యకలాపాలు ప్రారంభించేందుకు కావాల్సిన అన్ని సదుపాయాలు హైదరాబాద్‌లో ఉన్నాయని తెలిపారు. భారతదేశానికి హైదరాబాద్ గేట్‌వే అని, ఓపెన్ ఏఐ లాంటి సంస్థలకు ఆదర్శవంతమైన కేంద్రంగా అభివర్ణించారు. హైదరాబాద్ నగరం భారతదేశంలోనే అత్యంత శక్తిమంతమైన ఇన్నోవేషన్ పర్యావరణ వ్యవస్థను కలిగి ఉందని, టీ వీ టీ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, రీసెర్చ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ వంటివి ఇక్కడ ఉన్నాయని తెలిపారు.

హైదరాబాద్ నగరం ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా, ఆపిల్, క్వాల్‌కామ్ లాంటి అనేక గ్లోబల్ టెక్ దిగ్గజాలకు కేంద్రంగా మారిందని వెల్లడించారు. ఇక్కడ సాంకేతిక, స్టార్టప్ రంగాల్లో అపారమైన ప్రతిభ ఉందని పేర్కొన్నారు. భారతదేశానికి ఏఐ రాజధానిగా రాష్ట్రం మారడానికి గత దశాబ్ద కాలంగా తెలంగాణ ప్రభుత్వం అనేక సాహసోపేతమైన చర్యలు తీసుకుందని, ఇందులో 2020 సంవత్సరాన్ని ‘ఇయర్ ఆఫ్ ఏఐ’గా ప్రకటించడం, అనేక ఏఐ ఆధారిత కార్యక్రమాలను ప్రోత్సహించడం వంటివి ఉన్నాయని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రతిభ, ఇన్నోవేషన్, నూతన ఆవిష్కరణలు, గ్లోబల్ కనెక్టివిటీల కలయికతో ఏఐ విప్లవాన్ని ముందుకు నడిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

సురవరం జీవితం పేదలకు అంకితం: కేటీఆర్  

సీపీఐ అగ్ర నాయకులు, నల్గొండ మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి మరణం పట్ల కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలంగాణ రాజకీయాలకు, కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు అని, సుధాకర్‌రెడ్డి జీవితాన్ని ప్రజలు, పేదల అభ్యున్నతి కోసం అంకితం చేశారని కొనియాడారు.

నల్గొండ పార్లమెంట్ సభ్యుడిగా ఆయన సేవలు అపారమైనవని తెలిపారు. విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన నిలువుటద్దమని, ఆయన పోరాట స్ఫూర్తి, నిబద్ధత అందరికీ స్ఫూర్తిదాయకమని స్ప ష్టం చేశారు. సుధాకర్‌రెడ్డి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.