calender_icon.png 24 August, 2025 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల హత్యకు స్కెచ్?

24-08-2025 12:55:45 AM

-నీటి ట్యాంకులో పురుగుల మందు కలిపిన ఉపాధ్యాయుడు!

-11 మంది విద్యార్థులకు అస్వస్థత

-భూపాలపల్లి అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఘటన

జయశంకర్ భూపాలపల్లి/రేగొండ (మహబూబాబాద్), ఆగస్టు 23 (విజయక్రాంతి) : ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్, సిబ్బంది మధ్య కీచులాటలు విద్యార్థుల ప్రాణం మీదకి తెచ్చాయి. ఓ ఉపాధ్యాయుడు స్కూల్‌లోని నీటి ట్యాంకులో పురుగుల మందు కలిపాడు. ఆ నీళ్లు తాగిన 11మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో శుక్రవారం జరిగింది.

శనివారం కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఎస్పీ కిరణ్ ఖరే జిల్లా ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. సంఘటనపై విద్యా ర్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక విచారణ తర్వాత ఇందుకు బాధ్యులుగా పాఠశాల సైన్స్ టీచర్ రాజేందర్‌తో సహా మరో ఇద్దరు ఉపాధ్యాయులు వేణు, సూర్యప్రకాష్‌తో పాటు, వంట మనిషిని రాజేశ్వరిని సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటిం చారు.

అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం సాయం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ సంఘటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శనివారం కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాల నిర్వాహకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, విధుల నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.  సోమవారం నుండి నిరంతరం పర్యవేక్షణ చేసి ఎప్పటికప్పుడు నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిఇఓ రాజేందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.