07-01-2026 12:09:18 AM
స్పందించిన అధికారులు...
బెల్లంపల్లి, జనవరి 6 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఎస్సీ కార్పొరేషన్ స్థలం కబ్జాకు గురవుతున్న నేపథ్యంలో అధికారులు ఎట్టకేలకు కాళ్లకు పనిపెట్టారు. ఈ నెల 5న ‘ఎస్సీ కార్పొరేషన్ స్థలం కబ్జా’ పేరిట ‘విజయక్రాంతి’ దిన పత్రికలో వచ్చిన వార్త కథనానికి అధికారులు స్పందించారు. ఆక్రమిత స్థలాన్ని కాపాడేందుకు సంబంధిత శాఖ, రెవెన్యూ అధికారులు అడుగు ముందుకు వేశారు. మంగళ వారం బెల్లంపల్లి తహసీల్దార్ కృష్ణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్, మున్సిపల్ అధికారులు, ఆక్రమిత ఎస్సీ కార్పొరేషన్ భవన సముదాయం పరిధిలోని స్థలాన్ని పరిశీలించారు.
ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిశీలించి కబ్జాదారుడిని అధికారులు విచారించారు. అసలు అధికారుల వద్ద ఎస్సీ కార్పొరేషన్ కు సంబంధించి ఎంత స్థలం ఉండాలి, మ్యాప్ తదితర సరైన వివరాలు ఉన్నాయా! లేవా..! అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కబ్జా చేసిన వారు అధికారుల వద్ద సరైన డాక్యుమెంట్లు లేకపోవడంతోనే తన పని తాను కానిచ్చినట్లు సమాచారం. స్థలం ఆక్రమణ విషయంలో విచారణ చేసిన అధికారులు ఎలా వ్యవహరిస్తారో వేచి చూడాలి మరి...