05-04-2025 12:00:00 AM
శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలి
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 4 (విజయక్రాంతి) : నగరంలోని హకీంపేటలో వరద ప్రవాహంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా సమగ్ర చర్యలు తీసుకోవాలని, శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. గురువారం కురిసిన వర్షాలకు కార్వాన్, జూబ్లీ హిల్స్ సర్కిల్ పరిధిలో నీళ్లు నిలిచిన ప్రాంతాల్లో శుక్రవారం జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, ఎస్‌ఈ రత్నాకర్, ఇతర అధికారులతో కలిసి కమిషనర్ పర్యటించారు. బంజారాహిల్స్ ఎమెల్యే కాలని, లోటస్ పాండ్ నుంచి వరద హకీంపేట మీదుగా బల్కంపేట చెరువులోకి వెళుతున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు కమిషనర్ కు తెలిపారు.
హెచ్‌ఎండీఏ లేఔట్ చేయడం వల్ల వర్షం కురిసినప్పుడు వరద వస్తోందని, గతంలో వరద రాలేదని స్థానికులు తెలిపారు. చెట్లు ఉండడం వల్ల వరద రాలేదని, ఇప్పుడు వరద, మట్టి వస్తోందని చెప్పారు. వరదలో వచ్చిన మట్టిని వెంటనే తొలగించాలని కోరారు. ఇలాంటి పరిస్థితులు పునరా వృతం కాకుండా శాశ్వత పరిష్కారానికి డీపీఆర్ తయారు చేసి పంపాలని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో కార్వాన్, జూబ్లీహిల్స్ ఈఈలు వెంకటశేషాచలం, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.