12-05-2025 12:20:08 AM
మణుగూరు మే 11 (విజయ క్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లామణుగూరు సింగరేణి ఏరియా కార్మిక పిల్లలతో పాటు, ప్రాజెక్ట్ ప్రభావిత ప్రాంతాల్లో నివాసం ఉండే నిరుద్యోగులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మణుగూరు ఏరియా సింగరేణి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి వేంకటేశ్వర్లు యాజమాన్యాన్ని కోరారు.
ఈ మేరకు ఆదివారం ఎస్ ఓ టు జి ఎం శ్యాం కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు, వారికి ఉజ్వల భవిష్యత్తు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఎంతో దోహద పడుతుందన్నారు. ఇప్పటికే పలు విధాలుగా ప్రాజెక్ట్ ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న స్థానిక సింగరేణి యాజమాన్యం కు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల మరింత మంది నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించినట్లు అవుతుందన్నారు.
ముఖ్యంగా డిగ్రీ, డిప్లమా, ఐటిఐ, టెన్త్ చదివిన సింగరేణి కార్మిక పిల్లలతో పాటు ప్రాజెక్ట్ ప్రభావిత ప్రాంతాల పిల్లలకు మార్కెట్ లో ప్రస్తుతం ఎక్కువగా డిమాండ్ ఉండే కోర్సులు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ నెలకొల్పి ఇప్పించడం ద్వారా వారి బంగారు భవిష్యత్తుకు సింగరేణి యాజమాన్యం భరోసా ఇచ్చినట్లు అవుతుందన్నారు.
ముఖ్యంగా సోలార్ టెక్నీషియన్, డ్రోన్ టెక్నీషియన్, కంప్యూటర్, డి టి. పి, ఆర్క్ వెల్డింగ్, గ్యాస్ వెల్డింగ్, కాశ్మీ టాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సెల్ ఫోన్, టూ వీలర్ మెకానిక్ తదితర కోర్సులతో పాటు మహిళలకు ఎంబ్రాయిడరీ, టైలరింగ్, జ్యూట్, పేపర్ బ్యాగ్స్ తయారీ ఫ్యాషన్ డిజైనింగ్ డ్రాప్టింగ్, కటింగ్, స్టిచ్చింగ్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇప్పించే అంశంలో యాజమాన్యం ప్రత్యేక చొరవ చూపి స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బంగారి పవన్ కుమార్, మస్తాన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.