09-08-2025 12:36:48 AM
బీసీలను మోసం చేయడం కాంగ్రెస్ నైజం, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్
యాదాద్రి భువనగిరి ఆగస్టు 8 ( విజయ క్రాంతి ): ఢిల్లీ మెడలు వంచి బిసి బిల్లును సాధించుకొస్తా నని బీరాలు పలికి ధర్నా చేసిన ముఖ్యమంత్రి ఏమి సాధించారని బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్ ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రులు, ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకువెళ్లి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తే రాహుల్ గాంధీ, ఖర్గే పాల్గొనలేదు. ధర్నా తుస్సు మని నవ్వుల పాలయిందని విమర్శించారు.
బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్ నైజం అని చిత్తశుద్ధి ఉంటే తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. చేర్చకుండా స్థానిక ఎన్నికల్లోకి వెళితే ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీని అడ్డుకుంటామని మాజీ ఎమ్మెల్యే హెచ్చరించారు. కామారెడ్డి బిసి డిక్లరేషన్తో బీసీ ఓట్లను దన్నుకుని ఇప్పుడు మాట మారుస్తున్న రేవంత్ రెడ్డి మోసకారి అని విమర్శించారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత బీసీ రిజర్వేషన్లు 42% కల్పిస్తామని చెప్పడం సిగ్గుచేటు అని విమర్శించారు.
మరో మూడేళ్లపాటు బీసీలను మోసం చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారని అన్నారు. 42 శాతం రిజర్వేషన్ కల్పించడం అనేది బీసీలకు చేస్తున్న అన్యాయంలో భాగమని పేర్కొన్నారు. ఈనెల 14న కరీంనగర్ జిల్లా కేంద్రంలో టిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ గర్జన మహాసభ జరుగుతున్నదని ఈ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి వేలాదిగా బీసీ సోదరులు తల్లి రావాలని మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్ కోరారు. ఈ సభకు తమ నాయకుడు కేటీఆర్ తో పాటు అనేకమంది బీసీ నాయకులు పాల్గొంటారని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు డాక్టర్ రేఖల శ్రీనివాస్, జనగాం పాండు, సందెల సుధాకర్, అధికం లక్ష్మీనారాయణ గౌడ్, రచ్చ శ్రీనివాస్ రెడ్డి, మల్లికార్జున్, ఓం ప్రకాష్ పాల్గొన్నారు.