calender_icon.png 4 May, 2025 | 10:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంస్థాగత నిర్మాణంపై కాంగ్రెస్ కసరత్తు

04-05-2025 05:51:00 PM

గ్రామస్థాయి నుంచి జిల్లా వరకు నిర్మాణం..

మహబూబాబాద్ (విజయక్రాంతి): సంస్థ గత నిర్మాణంపై కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. గ్రామస్థాయి నుంచి మొదలుకొని మండల, బ్లాక్, జిల్లా కమిటీల పటిష్టత కోసం ఎఐసిసి ఇచ్చిన పిలుపుమేరకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం మహబూబాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో టీపీసీసీ పరిశీలకులు రవళి రెడ్డి, పొట్ల నాగేశ్వరరావు, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ తో పాటు రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల, గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు.

2017 కు ముందు కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం పనిచేసిన నాయకులకు పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసే విధంగా సంస్థ గత మార్పులు చేయడానికి అధిష్టానం నిర్ణయించినట్లు ప్రచారం సాగుతోంది. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో మండల స్థాయిలో కూడా సమావేశాలు నిర్వహించాలని తీర్మానించారు. పార్టీ పదవులు ఆశించే ఔత్సాహికుల నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టి, వారి పనితీరును పరిశీలించి సంస్థ గత పదవులను అప్పగించే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అలాగే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై అభిప్రాయ సేకరణ జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలం తర్వాత సంస్థాగతంపై దృష్టి సారించడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించేందుకు ముందుకు రావడం పట్ల కార్యకర్తలు, నాయకుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.