18-05-2025 12:53:21 AM
-శశిథరూర్‌ను అఖిలపక్ష ఎంపీల బృంద నాయకుడిగా నియమించిన కేంద్రం
-అసలు థరూర్ పేరే పంపలేదన్న హస్తం నేతలు
న్యూఢిల్లీ, మే 17: ఉగ్రవాదంపై భారత్ తీసుకుంటున్న చర్యలను ఐక్యరాజ్య సమితి దేశాలకు వివరించేం దుకు కేంద్రం అఖిలపక్ష ఎంపీలతో ఏడు బృందాలను ఏర్పాటు చేసింది. ఆ ఏడు బృందాలకు ఏడుగురు ఎంపీలను నియమిస్తూ శనివారం పార్లమెం ట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు.
అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ నియామకంపై హస్తం పార్టీ ఫైర్ అవుతోంది. అసలు శశిథరూర్ పేరే పంపకపోయినా ఆయన్ను ఎలా ఎంపిక చేశారని ప్రశ్నిస్తోంది. ఆ పార్టీ నేత జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా దీనిపై స్పందించారు. ‘మే 16న రిజిజు కాంగ్రెస్ నాయకుల పేర్లు పంపాలని కోరారు.
అప్పుడు రాహుల్ గాంధీ నలుగురి పేర్లు పంపారు. రాహుల్ గాంధీ పంపిన పేర్లలో అసలు శశిథరూర్ పేరే లేదు.’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పంపిన జాబితాలో.. కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ, రాజ్యసభ ఎంపీ డాక్టర్ సయ్యద్ నజీర్ హుస్సేన్, రాజా బ్రార్, గౌరవ్ గొగొయ్ ఉన్నారని జైరాం రమేశ్ వెల్లడించారు.