29-07-2025 04:33:12 PM
కామారెడ్డి (విజయక్రాంతి): మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క(Minister Seethakka) అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా దోమకొండలో ఏర్పాటు చేసిన మహిళ సంఘాల సంబరాలు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆమె మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి మహిళను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ గ్రామంలోని శ్రీ వనదుర్గ పెద్దమ్మతల్లి కళ్యాణ మండపంలో దోమకొండ, బీబీపెట్ మండలాల్లోని లబ్ధిదారులకు నూతన ఆహార భద్రత కార్డుల పంపిణీ చేశారు. మహిళా సంఘాలకు రుణాలకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు.
మహిళా సంఘాల్లో అదనపు సభ్యుల చేర్పు లేఖలను రాష్ట్ర పంచాయితీరాజ్, మహిళా శిశుసంక్షేమ శాఖ, జిల్లా ఇంచార్జిమంత్రి ధనసరి అనసూయ (సీతక్క), ప్రభుత్వ సలహాదారు (ఎస్సీ, ఎస్టీ, ఒబిసి, మైనారిటీ సంక్షేమం) షబ్బీర్ అలీ లబ్ధిదారులకు అందచేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని 352 మంది లబ్ధిదారులకు, బీబీపేట్ మండంలోని 555 మంది లబ్ధిదారులకు నూతన ఆహార భద్రత కార్డు లు, రేషన్ కార్డులోఅదనపు సభ్యుల చేర్పు లేఖలను పంపిణీ చేశారు. జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క మాట్లాడుతూ... 2004 నుండి 2014 వరకు పేద వారికి ప్రభుత్వం రేషన్ కార్డులను అందించిందని, తిరిగి ఈ రోజు పంపిణీ చేసుకోవడం జరుగుతుందని అన్నారు. రేషన్ కార్డు ద్వారా ఇంట్లో ప్రతి ఒక్కరికి 6 కిలోల బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని, దీని ద్వారా ఒక్క బియ్యం కొరకు పెట్టే ఖర్చు ఎంత తగ్గుతుందో ఒక సారి ఆలోచించుకోవాలని అన్నారు. పేదల కడుపు నింపడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. మూడు నెలలకు సరిపడా సరుకులు ముందస్తు గానే ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.