23-10-2025 06:40:24 PM
మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు..
లక్షేట్టిపేట (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం గాడి తప్పిన ప్రభుత్వ పాలనగా కొనసాగుతుందని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఐబీ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రభుత్వ పాలన సక్రమంగా లేదని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారులకు ప్రభుత్వం మట్టి, ఇసుకను పంపిణీ చేస్తామని చెప్పి ఇవ్వడం లేదన్నారు. మట్టిని వెంచర్లకు అమ్ముకుంటున్నారని పట్టణంలోని కమ్యూనిటి హాల్ కు అందించాల్సిన మట్టిని అందించకుండా ఇతరులకు అందిస్తున్నారని అన్నారు.
మైనింగ్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ వసతి గృహాలకు బిల్లులు సక్రమంగా చెల్లించడం లేదని నిర్వాహణ సక్రమంగా లేదని విమర్శించారు. ప్రభుత్వానికి మధ్యంపై ఉన్న శ్రద్ద విద్యపై లేదని విద్యార్థులపై చిన్నచూపు చూస్తుందన్నారు. పాలనను గాలికి వదిలేసి లాభాల కోసం పాకులాడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మెన్ నల్మాసు కాంతయ్య, మాజీ వైస్ చైర్మెన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, నాయకులు పాదం శ్రీనివాస్, చుంచు చిన్నయ్య, అనిల్, చుంచు శ్రీనివాస్, చాంద్, లింగన్న, శంకర్రావు. గడికొప్పుల సతీష్, తిరుపతి పాల్గొన్నారు.