calender_icon.png 24 October, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై డేగ కన్ను

24-10-2025 12:14:29 AM

  1. ఎన్నికల పరిశీలకుడు రంజిత్‌కుమార్‌సింగ్ 
  2.   10 కేసులు, రూ.2.75 కోట్ల నగదు స్వాధీనం: డీఈవో కర్ణన్

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 23 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. కేంద్ర ఎన్నికల పరిశీలకుడు రంజిత్‌కుమార్‌సింగ్ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెంటర్, ఎంసీసీ కంట్రోల్ రూం, 24/7 కాల్ సెంటర్లను గురువారం పరిశీలించారు.

ఎన్నికల నియమావళి ఉల్లంఘనల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని అధికారులను ఆదేశించారు. ఆయనవెంట పోలీస్ పరిశీలకులు ఓం ప్రకాశ్ త్రిపాఠి, వ్యయ పరిశీలకులు సంజీవ్ కుమార్ లాల్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వి కర్ణన్‌తో ఉన్నారు. ఈ సందర్భంగా కర్ణన్ మాట్లాడుతూ.. ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటివరకు రూ.2.75 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని, 10కి పైగా కేసులు నమోదు చేశామని తెలిపారు.

ఈవీఎంల అనుసంధానంపై ఆరా

జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోని పన్వర్ హాల్‌లో బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్‌ల అనుసంధాన ప్రక్రియను పరిశీలించారు. సిబ్బందికి ఈ ప్రక్రియపై శిక్షణ ఇవ్వాలని రంజిత్‌కుమార్ సింగ్ సూచించారు. ఈవీఎంల ఫస్ట్ లెవెల్ చెకింగ్ ప్రక్రియ చాదర్‌ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్‌లో గురువారం జరిగింది.