28-10-2025 05:31:06 PM
రాష్ట్రంలో గాలికుంటు వ్యాధిని శాశ్వతంగా రూపుమాపుతాం..
మత్స్యశాఖకు రూ.123 కోట్లు..
రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి..
రేగొండ/భూపాలపల్లి (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యుల అభివృద్ధి కోసమే పనిచేస్తుందని, రాష్ట్రంలో పశువులకు గాలికుంటు వ్యాధులను శాశ్వతంగా రూపుమాపడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం రేగొండలో పశువులకు గాలికుంటు వ్యాధులకు నివారణ టీకాలు, గణపురం మండలంలో ఉచిత చేపల పంపిణీ కార్యక్రమాలకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, డిసిసి అధ్యక్షుడు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ అయితే ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ లతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరై పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసి అనంతరం మాట్లాడారు.
రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, అభివృద్ధి సంక్షేమ పథకాల్లో దూసుకుపోతున్నామని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.పేద ప్రజల ప్రభుత్వంగా తమ పాలన కొనసాగుతోందని, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కులగణన చేపట్టామని ఆయన తెలిపారు.రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే గత ప్రభుత్వం అభాండాలు వేస్తోందని ఆయన విమర్శించారు.
పశు సంపదకు టీకాలు, గాలికుంటుపై పోరాటం..
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 3 కోట్ల 24 లక్షల పశువులకు 54 లక్షల టీకాలు వేయడం జరిగిందని మంత్రి వెల్లడించారు.త్వరలోనే రాష్ట్రంలో గాలి కుంట వ్యాధిని శాశ్వతంగా రూపు మాపుతామని హామీ ఇచ్చారు. పశువులకు టీకాలు వేయించడం ద్వారా పశువుల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు.గాలికుంటు వ్యాధులు పశువుల పాల ఉత్పత్తితో పాటు రైతుల ఆదాయం పై ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు.అందుకే తప్పక పాడి,పశువుల రైతులు గాలికుంటు టీకాలు వేసుకోవాలని ఆయన సూచించారు. అలాగే సామాన్య ప్రజలకు కూడా టీకాలు వేస్తున్నామని తమ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.
మత్స్య శాఖకు భారీ కేటాయింపులు..
గత ప్రభుత్వాలలో మత్స్య శాఖను ముదిరాజ్ లకు కేటాయించలేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నేను ముదిరాజ్ బిడ్డనని నాకు ఆ శాఖ ఇచ్చారని గుర్తుచేస్తూ,తమ ప్రభుత్వం మత్స్య శాఖకు రూ. 123 కోట్లు మంజూరు చేసిందని మంత్రి తెలిపారు.ఇందులో రూ. 94 కోట్లతో చేపలు, రూ. 28 కోట్లతో రొయ్యల పెంపకం చేపడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 26 వేల చెరువులలో 100 శాతం సబ్సిడీతో చేపల పెంపకం చేపడుతున్నామని వివరించారు.
రైతు సంక్షేమం, రేషన్ బియ్యంపై శ్రద్ధ
గత ప్రభుత్వం వరి వేస్తే ఉరి అని చెప్పగా, తమ ప్రభుత్వం సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తోందని మంత్రి శ్రీహరి తెలిపారు. పేద ప్రజలకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేసి, సన్న బియ్యం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని, ఇందుకోసం సంవత్సరానికి రూ. 4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. రుణమాఫీ అమలు గత ప్రభుత్వం చేయలేని రుణమాఫీని తమ ప్రభుత్వం పూర్తి చేసిందని మంత్రి వెల్లడించారు. ఒక్క భూపాలపల్లి నియోజకవర్గంలోనే రైతులకు రూ. 417 కోట్ల రుణమాఫీ జరిగిందని ఆయన గణాంకాలు తెలిపారు.
భూపాలపల్లికి కానుకలు
స్ధానిక ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు కోరిక మేరకు, భూపాలపల్లి జిల్లా కేంద్రంలో క్రీడా ప్రాంగణం,రెండు మండలాలకు రెండు పశు వైద్య శాలలు తక్షణమే మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు తమ ప్రభుత్వాన్ని కష్టపడి గెలిపించిన విధంగానే, రాబోవు రోజుల్లో కూడా ప్రజల ఆశీర్వాదం తమ ప్రభుత్వానికి ఉండాలని మంత్రి శ్రీహరి ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, పశుసంవర్ధక డిడి డాక్టర్ కుమారస్వామి,భూపాలపల్లి వ్యవసాయ కమిటీ చైర్మన్ గుటోజు కిష్టయ్య,చిట్యాల చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, పిఎసిఎస్ చైర్మన్ నడిపల్లి విజ్జన్ రావు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య, రేగొండ మండల పశు వైద్యాధికారి మైథిలి, కాంగ్రెస్ జిల్లా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.