23-12-2025 12:00:00 AM
- బీఆర్‌ఎస్ హయాంలోనే అభివృద్ధి
- అభివృద్ధికి నిధులు ఇవ్వకుంటే ఎక్కడిక్కడ అడ్డుకుంటాం
- దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
సిద్దిపేట, డిసెంబర్ 22 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి రేవంత్ సర్కార్ పైసా నిధులివ్వలేదని, కెసిఆర్ ప్రభుత్వం హయాంలోనే గ్రామాలన్నీ అభివృద్ధిలో పరుగులు పెట్టాయని, ఒకవేళ నిధులు ఇవ్వకుంటే గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులను తిరగనియ్యమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణస్వీకారోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసిన మహాత్మ గాంధీ కలలను నిజం చేసిన నాయకుడు మాజీ సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందన్నారు. ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డ్, స్మశాన వాటిక, హరితహారం వంటి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశామని తెలిపారు. గ్రామాల మౌలిక వసతులు బలోపేతం చేయడంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిందన్నారు. రెండేళ్లుగా గ్రామ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఎన్నికైన సర్పంచులు పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజల కోసం పని చేయాలని సూచించారు.దుబ్బాక ప్రాంతానికి మల్లన్న సాగర్ నుంచి సాగునీరు అందాలంటే కాలువలు పూర్తి కావాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ వంటి మూడు భారీ సాగునీటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కరోజు కూడా సమీక్ష చేయలేదని విమర్శించారు. సాగునీటి అంశంపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా కలెక్టర్ గానీ, సంబంధిత అధికారులు గానీ స్పందించని పరిస్థితి నెలకొందని తెలిపారు. ఈ నిర్లక్ష్య ధోరణిని విడిచిపెట్టి ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు ముందుకు రావాలని సూచించారు.