24-09-2025 05:32:51 PM
గ్రామ పంచాయితీ నిధుల కేటాయింపులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తిగా కుంటుపడ్డాయి
గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు విడుదల చేయాలి
బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నల్ల భూపాల్ రెడ్డి
అనంతగిరి: గ్రామ పంచాయతీలకు నిధుల కేటాయింపుల్లో ప్రభుత్వం విఫలమయిందని మండిపడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నల్ల భూపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.గత కొంతకాలంగా పంచాయతీలకు నిధులు అందడం లేదని, దీంతో క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన ఆరోపించారు. గ్రామ పంచాయతీలకు గత 16 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విడుదల కావడం లేదని భూపాల్ రెడ్డి విమర్శించారు.
నిధుల కొరత కారణంగా గ్రామ పంచాయతీ ట్రాక్టర్లను నడిపేందుకు కూడా డీజిల్ లేని దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో పంచాయతీ కార్యదర్శులు ట్రాక్టర్ల తాళాలను ఉన్నతాధికారులకు అప్పగించేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.ప్రభుత్వం మారితే మార్పు వస్తుందని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని, అయితే ఇప్పుడు గ్రామాల్లో కనిపిస్తున్న ఈ దుస్థితేనా ఆ మార్పు? అని ప్రశ్నించారు.ఇది మార్పు కాదు, ఏమార్పు అంటూ ఆయన ఎద్దేవా చేశారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీలకు క్రమం తప్పకుండా నిధులు విడుదల చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మాత్రం గ్రామాలకు నిధుల కటకట ఏర్పడిందని ఆరోపించారు. ఈ నిధుల కొరత వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు పూర్తిగా కుంటుపడ్డాయని ఆయన తెలిపారు.కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే దుస్థితి లేక మోకం చాటేస్తూ ఎన్నికల నిర్వహణలో అలసత్వం చూపిస్తుందనీ అన్నారు.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.