calender_icon.png 7 January, 2026 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంపు గ్రామాల ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్

05-01-2026 10:29:26 AM

బిఆర్ఎస్ నియోజకవర్గ వంటేరు ప్రతాప్ రెడ్డి 

గజ్వేల్: ఏటిగడ్డ కిష్టాపూర్‌లో దీక్ష సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, అధికారంలోకి వచ్చిన తర్వాత ముంపు గ్రామాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని బిఆర్ఎస్ నియోజకవర్గ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి  మాట్లాడుతూ  వర్గల్ ఇండస్ట్రియల్ పార్క్ భూ సేకరణ సమయంలో కాంగ్రెస్ నాయకులు ఎకరానికి రూ.60 లక్షలు ఇస్తామని చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చాక ఆ హామీలను మరిచిపోయారన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో భూ సేకరణకు రూ.10 లక్షల పరిహారం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రస్తుతం కాంగ్రెస్ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ గజ్వేల్ పర్యటనకు వస్తే వర్గల్ మండల రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద కాంగ్రెస్ నిరుద్యోగులు ధర్నాలు చేయడం రాజకీయ లబ్ధి కోసమేనని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి మెప్పుకోసం చేసే  ధర్నాలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక పదవులు ఖాళీగా ఉన్నాయని, నిజంగా ఉద్యోగాలపై చిత్తశుద్ధి ఉంటే సీఎం వద్దకు వెళ్లి అక్కడే ధర్నాలు చేసి ఉద్యోగాలు పొందాలని సూచించారు.

గజ్వేల్ అభివృద్ధిపై కాంగ్రెస్ నాయకులకు ఆసక్తి లేదని, పదవుల కోసం మాత్రమే తాపత్రయపడుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అభివృద్ధితో గజ్వేల్ రూపురేఖలు మారిపోయాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో ఒక్క రూపాయి అభివృద్ధి కూడా చేయలేదని, గత కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.180 కోట్ల నిధులను రద్దు చేయడమే చేసిందని ఆరోపించారు.

రైతులకు సాగునీరు అందించడం, కాలువల తవ్వకం, రద్దైన నిధుల పునరుద్ధరణ, యూరియా సరఫరా వంటి కీలక అంశాలను పక్కన పెట్టి ధర్నాలు చేయడం కాంగ్రెస్ నాయకుల అవివేకానికి నిదర్శనం అన్నారు. కనీసం కేసీఆర్ చేసిన అభివృద్ధిలో 10 శాతం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం చేయగలదా అని ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్‌సీ రాజమౌళి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు నమాజ్ మీరా, మాజీ జెడ్పిటిసి పంగా మల్లేశం, పీఏసీఎస్ చైర్మన్ జేజేల వెంకటేష్ గౌడ్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఖాజా విరాసత్ అలీ, మాజీ వైస్ చైర్మన్ జాకీయుద్దీన్, మాజీ కౌన్సిలర్లు గోపాల్ రెడ్డి, మరికంటి కనకయ్య, బొగ్గుల చందు, మామిడి శ్రీధర్, శ్రీనివాస్ రెడ్డి, కిష్టాపూర్ ఆర్ అండ్ ఆర్ కాలనీ సర్పంచ్ ప్రతాప్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి బొగ్గుల సురేష్, సీనియర్ నాయకులు నర్సింగా రావు, భూపాల్ రెడ్డి, గోలి సంతోష్, పాల రమేష్ గౌడ్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.