calender_icon.png 5 August, 2025 | 1:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి కాంగ్రెస్ జనహిత పాదయాత్ర

31-07-2025 01:26:40 AM

పరిగి నుంచి ప్రారంభించనున్న మీనాక్షి, మహేశ్‌గౌడ్ 

హైదరాబాద్, జులై 30 (విజయక్రాంతి): బడగు బలహీనవర్గాలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకై పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఒక వైపు ఢిల్లీ కేంద్రంగా ఆందోళన చేపడుతూనే.. మరో వైపు రాష్ట్రంలో పార్టీ నిర్మాణంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, బీసీ రిజర్వేషన్ల అమలు కోసం చేస్తున్న కృషిని ప్రజలకు వివరించేందుకు పీసీసీ సన్నద్ధమవుతోంది.

అందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ నేతృత్వంలో ‘జనహిత పాదయాత్ర’ పేరుతో గురువారం నుంచి ఆగస్టు 4 వరకు రాష్ట్రంలోని నాలుగు నియోజకవర్గాల్లో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షినటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ బుధవారం సమావేశమయ్యారు.

పార్టీ నిర్మాణం, పాదయాత్ర, బీసీ రిజర్వేషన్ల సాధన పోరాటంపై దాదాపు గంటన్నర సేపు చర్చించారు. రంగారెడ్డి జిల్లా పరిగి నియోజకవర్గంలో ప్రారంభించే పాదయాత్రలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షినటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో పాటు పార్టీకి చెందిన ముఖ్యనేతలు పాల్గొనున్నారు.

ముందుగా ఆగస్టు 6వ తేదీ వరకు పాదయాత్ర నిర్వహించాలని భావించారు. అయితే ఢిల్లీలో ఆగస్టు 5, 6, 7 తేదీల్లో బీసీ రిజర్వేషన్లపై ఆందోళన కార్యక్రమాలు ఉండటంతో 4వ తేదీ వరకే యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. ఢిల్లీ పర్యటన తర్వాత యథావిధిగా పాదయాత్ర కొనసాగించనున్నారు.

కాగా, ఆగస్టు 5, 6, 7 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులను సన్నద్దం చేయాలని నిర్ణయించారు. ఆగస్టు 5న పార్లమెంట్ ఉభయ సభల్లో ఎంపీల వాయిదా తీర్మానం చర్చకు పట్టుబట్టాలని నిర్ణయించారు. 6వ తేదీన జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమానికి పార్టీ శ్రేణులను పెద్ద సంఖ్యలో తరలించేలా చూడాలని భావిస్తున్నారు.

ఈ ధర్నాకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ సీనియర్ నాయకులతో పాటు బీసీ సంఘాల నాయకులు కూడా హాజరుకానున్నారు. ఆగస్టు 7న రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని అనుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ అగ్రనేతలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. 

ఢిల్లీకి ప్రత్యేక రైలు.. 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆగస్టు 6న చేపట్టే ఆందోళన కార్యక్రమానికి రాష్ట్రం నుంచి పెద్దఎత్తున బీసీ శ్రేణులను తరలించాలని నిర్ణయించారు. అందుకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేయనున్నారు. ప్రతి జిల్లా నుంచి కనీసం 50 మందికి తగ్గకుండా ఢిల్లీకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. అంతే కాకుండా పార్టీ శ్రేణులకు ఢిల్లీలో ఇబ్బంది కలగకుండా చూడాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.