17-01-2026 03:52:02 AM
పేర్లు మార్చే తుగ్లక్ పాలనకు వ్యతిరేకంగా 17న శాంతి ర్యాలీ
సనత్నగర్ జనవరి 16 (విజయ క్రాంతి):- ఎన్నికల హామీల ను అమలు చేయడం మరిచి ఊర్లు, పేర్లు మారుస్తామనే తుగ్లక్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎంతో గణ చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ప్రాంత అస్థిత్వాన్ని దెబ్బతీసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. మన అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఈ నెల 17 వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్ సర్కిల్ ల మీదుగా ఎంజీరోడ్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ, దక్షిణ మధ్య రైల్వే కార్యాలయం, రాష్ట్రపతి విడిది భవనం, క్లాక్ టవర్ వంటి అనేక చారిత్రక నిర్మాణాలు ఉన్నాయని గుర్తు చేశారు.
పాల్గొననున్న కేటీఆర్, తలసాని
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి నిర్వహించే శాంతి ర్యాలీలో బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిధిగా పాల్గొంటారని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మన ఆత్మగౌరవం, మన అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు, సికింద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వం పై గాంధేయ మార్గంలో ఒత్తిడి తీసుకొచ్చేలా నిర్వహించే శాంతి ర్యాలీ లో అన్ని వర్గాల ప్రజలు, వ్యాపార, వాణిజ్య, కార్మిక సంఘా లు, స్వచ్చంద సంస్థలు, మీడియా సంస్థల ప్రతినిధులు పాల్గొనాలని కోరారు.
ర్యాలీలో కెటిఆర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారని చెప్పారు. ప్రెస్‌మీట్‌లో లష్క ర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్‌గౌడ్, ప్రధానకార్యదర్శి సాదం బాలరాజ్‌యాదవ్ ఉన్నారు.