08-08-2025 11:30:38 PM
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన..
సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి అముదాల మల్లారెడ్డి..
చేర్యాల: సిద్దిపేట జిల్లా(Siddipet District) చేర్యాల పట్టణ కేంద్రంలో శుక్రవారం పాత బస్టాండ్ వద్ద సిపిఎం పార్టీ చేర్యాల మండల, పట్టణ కమిటీల ఆద్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దగ్దం చేశారు. అనంతరం సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అముదాల మల్లారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, బీహార్లో ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో 65 లక్షల ఓటర్లను తొలగించి ఆర్ఎస్ఎస్ మతతత్వ సిద్ధాంతాలను అమలు చేయడానికి బిజెపి పార్టీ ప్రయత్నిస్తుందన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఇప్పుడు ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో మరోసారి కుట్రకు పాల్పడుతుందని అందులో భాగంగానే బీహార్లో జరుగుతున్నటువంటి ఈ కుట్ర రేపటి రోజులల్లో దేశం మొత్తం వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా బీహార్ లోని ఎస్సీ నియోజకవర్గాలలో అధికంగా ఉన్న మైనారిటీ ఓట్లను తొలగించారని అయన అన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో ప్రస్తుతం బడుగులకు కలుగుతున్న కొద్దిపాటి ప్రయోజనం కూడా అందకుండా చేయాలని బీజేపీ చూస్తుందన్నారు. బిజెపి సిద్ధాంతాలతో బడుగు, బలహీన వర్గాలు, ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు దూరమయ్యే ప్రమాదం ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఓట్ల తొలగింపు చర్య పై సుప్రీం కోర్టు వెంటనే స్పందించి తొలగించినటు వంటి ఓట్లను తిరిగి ఓటర్ల జాబితాలో నమోదు చేయాలని లేనిచో సిపిఎం పార్టీ ఆద్వర్యంలో దేశ వ్యాప్తంగా ప్రజలందరినీ ఏకం చేసి పోరాటం ఉద్రుతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటి సభ్యులు కొంగరి వెంకట్ మావో,సిపిఎం చేర్యాల మండల కార్యదర్శి బండకింది అరుణ్ మండల కమిటి సభ్యులు ఏండి కరీం,నాగపూరి కనకయ్య,గొర్రె శ్రీనివాస్,రేపాక కుమార్,స్వర్గం శ్రీకాంత్,మోకు ఇంద్ర సేనా రెడ్డి,పట్టణ నాయకులు పోలోజు శ్రీహరి,రాళ్ళబండి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.