09-08-2025 03:09:28 AM
నాలుగు గేట్ల నుంచి నీటి విడుదల
చేవెళ్ల, ఆగస్టు 8: రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో హిమాయత్ సాగర్ పూర్తిస్థాయిలో నిండటంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తారు. గురువారం రాత్రి ఒక గేటు ఎత్తగా, శుక్రవారం ఉదయం మరో మూడు గేట్లు తెరిచి 1,400 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,763.50 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 1,763.10 అడుగుల వద్ద కొనసాగుతోంది.
మరింత వరద వస్తుండటం, మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. మరో రెండు గేట్లు ఎత్తితే లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని వారు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సి నారాయణరెడ్డి ఆదేశించారు. శుక్రవారం హిమాయత్ సాగర్‌ను ఆయన పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.