calender_icon.png 2 July, 2025 | 6:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక వాగుపై వంతెన నిర్మాణం వేగంగా చేపట్టాలి

02-07-2025 12:06:57 AM

సీపీఐ జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జునరావు 

వెంకటాపురం నూగూరు, జూలై 1( విజయ క్రాంతి):  మండలంలో మరమ్మతులకు గురైన ఏకన్న గూడెం సమీపంలోని ఇసుక వాగు పై వంతెన  నిర్మాణం వేగవంతంగా చేపట్టాలని ములుగు జిల్లా సిపిఐ పార్టీ కార్యదర్శి తోట మల్లికార్జున రావు డిమాండ్ చేశారు. మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఏకన్న గూడెం గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై కుంగిన వంతెన నిర్మాణం కారణంగా వెంకటాపురం, వాజేడు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వంతెన కూలిపోయి ఆరు నెలలు గడుస్తున్న మరమ్మతు పనులు పూర్తిస్థాయిలో నేటికీ చేపట్టపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్ల, వెంకటాపురం మధ్య వర్షాల కారణంగా రహదారిపై రాకపోకలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ విషయంపై భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు , రాష్ట్ర మంత్రి సీతక్క చొరవ చూపడంలో అలసత్వం వహించారని ఆరోపించారు.

ఆర్ అండ్ బి అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఇప్పుడు ప్రజలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొనేవారు కాదన్నారు. ప్రస్తుత వర్షాకాల సీజన్లో చినుకు పడితే డైవర్షన్ రహదారి ద్వారా ప్రజలు ప్రయాణం చేయడం ఇబ్బందికరంగా మారిందన్నారు. డైవర్షన్ రహదారి గుండా వెళ్లే వాహనాలు సైతం మట్టిలో, బురదలో కూరుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.

ప్రజల సమస్యలపై తక్షణం స్పందించాల్సిన జిల్లా అధికారులు సైతం సరిగా స్పందించకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా జిల్లా అధికారులు ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి స్పందించి వెంటనే రహదారి మరమత్తు పనులు వేగంగా చేపట్టేలా చర్యలు తీసుకొని ప్రజల ఇబ్బందులను తొలగించాలని ఆయన కోరారు.