calender_icon.png 4 July, 2025 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హ్యామ్ విధానంలో డబుల్ రోడ్ల నిర్మాణం

03-07-2025 01:25:39 AM

ఆగస్టు మొదటి వారంలో టెండర్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి 

 నల్లగొండ టౌన్,  జూలై 2 : రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల నుండి జిల్లా కేంద్రాలకు 12000 కోట్ల రూపాయలతో  హ్యామ్ విధానంలో డబుల్ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ రహదారి పనులకు ఆగస్టు మొదటి వారంలో టెండర్లను పిలువనున్నట్లు ఆయన వెల్లడించారు.

బుధవారం మంత్రి ఉమ్మడి నల్గొండ జిల్లా సమీక్ష అనంతరం 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన ఆర్ అండ్ బి ఎస్ ఈ  కార్యాలయాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ  శాఖల మంత్రి, నల్గొండ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు.అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ హ్యామ్ విధానంలో మండల కేంద్రాల నుండి జిల్లా కేంద్రాల డబుల్ రోడ్డు నిర్మాణానికి గాను గత క్యాబినెట్లో ఆమోదం పొందడం జరిగిందని, ఇందులో భాగంగా కాంట్రాక్టర్ 40%, బ్యాంకు ద్వారా 60 శాతం రుణం తీసుకుని రోడ్ల నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు.

ఈ విషయంపై గురువారం ఎర్రమంజిల్ లోని ఆర్ అండ్ బి ప్రధాన కార్యాలయంలో   సమావేశం నిర్వహించనున్నామని,  ముందుగా 10 ప్యాకేజీలకు సంబంధించి 3000 కోట్ల రూపాయలతో పనులకు టెండర్లు పిలువనున్నామని , మొదటి దశలో 5190 కోట్లతో, రెండవ దశలో 7000 కోట్లతో పనులు చేపట్టనున్నామని తెలిపారు. హ్యామ్ విధానం 7 రాష్ట్రాల్లో అమల్లో ఉందని, మన రాష్ట్రంలో పంచాయతీరాజ్ ద్వారా కూడా 15 వేల కోట్ల రూపాయలతో, మొత్తం 29 వేల కోట్ల రూపాయలతో హ్యామ్ రోడ్లు నిర్మించనున్నామని చెప్పారు.

ఆర్ అండ్ బి శాఖలో ఖాళీగా ఉన్న  150 ఏఈల నియామకానికి టీజిఎస్‌ఎస్సీకి నివేదించినట్లు చెప్పారు. నల్గొండ జిల్లాకు ఆర్ అండ్ బి ద్వారా 12000 కోట్ల రూపాయల పైనే నిధులు ఇవ్వడం జరిగిందని, రహదారులపై ఏ ఒక్క ప్రమాదం జరగకుండా అరికట్టాలన్నదే తమ లక్ష్యమని మంత్రి వెల్లడించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర ఎస్సీ ,ఎస్టీ, మైనార్టీ శాఖల మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో విద్య , ఇరిగేషన్ ప్రాజెక్టులు, రైతుల సంక్షేమతో పాటు  జిల్లా అభివృద్ధి చర్యలు తీసుకుంటామని, సంక్షేమంలో భాగంగా ఎస్సీ ,ఎస్టీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు రాబోయే రోజుల్లో వారి కాళ్లపై వారు నిలబడే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ , దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్, అండ్ బి ఎస్ ఈ వెంకటేశ్వరరావు ఈ ఈ లు,డి ఈ లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, తదితరులు ఉన్నారు.