17-09-2025 12:22:37 AM
దౌల్తాబాద్, సెప్టెంబర్ 16:పేదవారి ఇంటి కల నేరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు మండలంలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మండలంలో 311 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులను ఎంపిక చేశారు. ఇళ్లు మంజూరైన లబ్దిదారులు సొంత ఇంటి కల నెరవేరబోతున్నందుకు సంతోషంగా ఇంటి నిర్మాణాలు చేపట్టారు.
311 మందిలో 302 మంది లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ పనులు జోరుగా సాగుతుండగా స్లాబ్ స్థాయిలో 6 ఇండ్లు, గోడల స్థాయిలో 12 ఇండ్లు బేస్మెంట్ స్థాయిలో 72 ఇళ్లు నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణాలు జరుగుతుండగా కొంత మంది లబ్ది దారులు ప్రభుత్వ నిబంధనలు సడలించాలని కోరుతున్నారు.
ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇస్తామన్న రూ.5 లక్షలు ఇచ్చినా సరే కానీ పెద్ద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు సరి పోదని, ఇందిరమ్మ ఇంటికి అదనపు గదులు నిర్మించుకునేందుకు అవకాశం కల్పించాలని లబ్దిదారులు కోరుతున్నారు.
పనులు చురుగ్గా సాగుతున్నప్పటికీ లబ్ధిదారుల్లో ఇప్పటి వరకు 90 మంది మాత్రమే రూ. లక్ష చొప్పున బిల్లులు వచ్చినట్టు తెలిపారు.ఇంటి నిర్మాణం జరిగిన వరకు రావాల్సిన బిల్లులు వెంట వెంటనే ఇవ్వాలని కోరారు.త్వరగతిన బిల్లులు ఇస్తే మిగిలిన నిర్మాణ పనులు మరింత వేగవంతం చేస్తామని అంటున్నారు లబ్దిదారులు.