calender_icon.png 17 September, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విమోచన దినోత్సవం పండుగ వాతావరణంలో జరగాలి

17-09-2025 12:24:18 AM

సిద్దిపేట, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి):తెలంగాణ స్వరాష్ట్రంలో సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం పండగ వాతావరణంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ డిమాండ్ చేశారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రజాకార్లను వ్యతిరేకించిన ప్రజల మనోభావాలను బి.ఆర్.ఎస్ గౌరవించలేదని, కేసీఆర్ కూడా రజాకార్ల విధానాన్ని అనుసరించి పరిపాలనతో ఓటు బ్యాంకు రాజకీయం చేశారని ఆరోపించారు.

బి.ఆర్.ఎస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అధికారికంగా నిర్వహించడంలేదని ప్రశ్నించారు. తెలంగాణలో భాగంగా ఉన్న కొన్ని ప్రాంతాలు కర్ణాటక, మహారాష్ట్రంలో విలీనమయ్యాయి, అక్కడున్న మీ ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తున్నాయి అట్లనే తెలంగాణలో ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదని సిఎం రేవంత్ రెడ్డికి ధైర్యం లేక రజాకారుల వారసులను ఎదిరించలేడని ఆరోపించారు.

బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో అధికారంలో ఉండి చేయని పనిని బిజెపి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు అత్యంత ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ కేంద్రంగా సెప్టెంబర్ 17 విమోచన దినాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకల సందర్భంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పార్టీ అధ్యక్షులు బైరు శంకర్ ముదిరాజ్ వెల్లడించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో హాజరై ప్రధానికి జిల్లా పక్షాన శుభాకాంక్షలు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సంతోష్ గుప్తా, గుండ్ల జనార్ధన్, కేమ్మసారం సంతోష్ తదితరులు పాల్గొన్నారు.