20-09-2025 06:05:15 PM
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల అర్బన్,(విజయక్రాంతి): ఇందిరమ్మ పిల్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు.శనివారం జగిత్యాల పట్టణంలోని 5వ వార్డు, 11వ వార్డులో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... మొదటి విడతలో మంజూరైన ఇండ్ల పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంజూరైన ఇందిరమ్మ ఇండ్లకు గ్రౌండింగ్ చేసి పనులు వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిరుపేదలైన లబ్ధిదారులకు అవసరమైతే మహిళా సంఘాల మెప్మా ద్వారా రుణాలు అందజేసే విధంగా చూడాలని తెలిపారు.
ఇండ్ల నిర్మాణాలకు ఏవైనా సమస్యలు ఉన్నాయని లబ్ధిదారులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన 400 చదరపు అడుగులకు తగ్గకుండా 600 చదరపు అడుగులకు మించకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని తెలిపారు. పనులు సకాలంలో పూర్తిచేసి బిల్లులు త్వరగా పొందాలని లబ్ధిదారులకు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక ఉచితంగా అందిస్తుందని, రవాణా ఖర్చులు, కూలీల ఖర్చులు లబ్ధిదారులే చెల్లించాలని తెలిపారు. జగిత్యాల పట్టణంలో ఇసుక బజార్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని లబ్ధిదారులు వినియోగిచుకోవాలని తెలిపారు.
నాణ్యత లోపించకుండా సకాలంలో పనులు పూర్తిచేయాలని తెలిపారు. లబ్ధిదారులతో మాట్లాడి పనులు త్వరగా పూర్తిచేసి బిల్లులు పొందాలని, నాణ్యత ప్రమాణాలను పాటించాలని ఆదేశించారు. ప్రతి ఇంటి బేస్మెంట్ లెవెల్ పూర్తయిన ఇండ్ల ప్రగతిని ఎప్పటికప్పుడు పంపాలన్నారు. అలాగే పూర్తయిన ఇండ్ల ఫినిషింగ్ వారం వారం రిపోర్టు అందించాలన్నారు. టార్గెట్ ప్రకారం ఇంటి నిర్మాణాలు పూర్తి చేయాలని అన్ని యూనిట్స్ ఫాలో కావాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ స్పందన, వార్డు ఆఫీసర్, క్లస్టర్ ఆఫీసర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.