29-10-2025 01:15:30 AM
రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
ఖమ్మం , అక్టోబరు 28 (విజయ క్రాంతి): విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుగా అవసరమైన చోట సబ్ స్టేషన్ ల నిర్మాణం చేస్తున్నామని రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన, ప్రణాళిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మధిర నియోజకవర్గంలో పర్యటించి రూ. 2.97 కోట్లతో ఎర్రుపాలెం మండలం రేమిడిచెర్ల వద్ద, రూ. 2.97 కోట్లతో మధిర మండలం మడుపల్లి, రూ. 2.5 కోట్లతో బోనకల్ మండలం బ్రాహ్మణపల్లి, రూ. 2.97 కోట్లతో చిరునోముల, రూ. 3.09 కోట్లతో లక్ష్మీపురంల వద్ద చేపట్టిన 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణ పనులకు ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సి.ఎం. మాట్లాడుతూ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ఆధారంగా విద్యుత్ రవాణా, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా నూతన సబ్ స్టేషన్ ల నిర్మాణ పనులు చేపట్టామని అన్నారు. నూతన సబ్ స్టేషన్ నిర్మాణం వల్ల ఓల్టేజ్ నియంత్రణ సాధ్యమవుతుందని, మెరుగైన పవర్ ఫ్యాక్టర్ సాధిస్తామని అన్నారు. విద్యుత్ సిబ్బందికి కోటీ రూపాయల ప్రమాద బీమా కల్పించామని అన్నారు.
1912 విద్యుత్ అంబులెన్స్ ద్వారా విద్యుత్ సరఫరా సమస్యలను యుద్ద ప్రాతిపదికన పరిష్కరిస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఎస్ ఎన్పిడిసిఎల్ సిఎండి వరుణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, ఎన్పిడిసిఎల్ ఎస్‌ఇ శ్రీనివాసాచారి, పీఆర్ ఎస్‌ఇ వెంకట్ రెడ్డి, ఆర్ అండ్ బి ఇఇ తానేశ్వర్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.