calender_icon.png 19 September, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరాల అదుపునకు నిరంతరం కార్డెన్ సెర్చ్

19-09-2025 12:58:16 AM

డీసీపీ కోటిరెడ్డి 

మేడ్చల్, సెప్టెంబర్ 18(విజయ క్రాంతి): నేరాల అదుపునకు నిరంతరం కార్డెన్ సెర్చ్ లు నిర్వహిస్తామని డిసిపి కోటిరెడ్డి అన్నారు. గురువారం మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని కిష్టాపూర్ శివారులో కార్డెన్ సర్చ్ నిర్వహించారు.  అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్థానికుల నుంచి అనేక ఫిర్యాదులు రావడం వల్ల కిష్టాపూర్ శివారులో కార్డెన్ సర్చ్ నిర్వహించామన్నారు.

ఈ ప్రాంతంలో ఎక్కువగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు నివసిస్తున్నారని, ఎవరు ఎక్కడ నుంచి ఎందుకు వచ్చారు అనే వివరాలు లేవన్నారు. నేరాలు జరిగిన సమయంలో కూడా సరైన ఆధారాలు లభించడం లేదన్నారు. కార్డెన్ సర్చ్ తో అన్ని వివరాలు సేకరించామన్నారు. 300 ఇళ్లలో వెయ్యి మందిని తనిఖీ చేసి సమాచారం సేకరించామని ఆయన వివరించారు.

బీహార్ కు చెందిన 140, ఒడిస్సా కు చెందిన 96, ఝార్ఖండ్ కు చెందిన 72, మధ్యప్రదేశ్ కు చెందిన 40, అస్సాం కు చెందిన 52, ఉత్తరప్రదేశ్ కు చెందిన 36 మంది ఇక్కడ నివసిస్తున్నారని అన్నారు. ఇద్దరు గంజాయి తాగే వారిని అదుపులోకి తీసుకున్నామని, దుండిగల్ లో ఒక కేసులో ఉన్న ఒక వ్యక్తి ఇక్కడ ఉంటున్నట్టు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. అంతేగాక ధ్రువ పత్రాలు లేని రెండు నాలుగు చక్ర వాహనాలను,

పలు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశామన్నారు. 118 చలానా బకాయి ఉన్న వాహనాలను గుర్తించి 96 వేల రూపాయలు వసూలు చేశామన్నారు. ప్రజలకు ఎలాంటి అనుమానం వచ్చినా 100కు లేదా సమీప పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ ఆపరేషన్లో తనతోపాటు మేడ్చల్ అదనపు డీసీపీ, మేడ్చల్, పెట్ బషీరాబాద్ ఏసిపిలు, పదిమంది ఇన్స్పెక్టర్లు, వివిధ విభాగాలకు చెందిన 400 మంది సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు.