calender_icon.png 19 September, 2025 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంఘాల ముసుగులో రాజకీయ కక్ష సాధింపు

19-09-2025 12:59:53 AM

  1. కాంగ్రెస్ నాయకులపై తప్పుడు ఆరోపణలు సరికాదు.. 
  2. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: మణికొండ కాంగ్రెస్ హెచ్చరిక

మణికొండ,సెప్టెంబర్ 18: మణికొండ మున్సిపాలిటీలో అసోసియేషన్ల ముసుగులో బిఆర్‌ఎస్ నాయకులు రాజకీయాలకు పాల్పడుతున్నారని  మణికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  జితేందర్ విమర్శించారు. గురువారం మణికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ అసోసియేషన్లో జరిగిన గొడవకు తమ పార్టీ నాయకులకు ఎలాంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు.

తమ పార్టీ నేత కస్తూరి నరేంద్ప బిఆర్‌ఎస్ నాయకులు పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్యేనని వారు విమర్శించారు. అసోసియేషన్ల పేరుతో రాజకీయ పబ్బం గడుపుతున్న బిఆర్‌ఎస్ నాయకులు, కాంగ్రెస్ను విమర్శించడం హాస్యాస్పదంగా   ఉందని వారు ఎద్దేవా చేశారు. మణికొండ మున్సిపాలిటీలో  బిఆర్‌ఎస్ నాయకుల చరిత్రే  అందరికీ తెరిచిన పుస్తకమని...

సంఘాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య అని  ఆరోపించారు. ప్రస్తుత బిఆర్‌ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు ఒకప్పుడు ఆల్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉంటూ, పార్టీ కండువాతో సమావేశాలకు హాజరైన విషయాన్ని గుర్తుచేశారు. వెంకటేశ్వర కాలనీ అధ్యక్షుడిగా చెప్పుకునే ఉపేంద్రనాథ్ రెడ్డి బిఆర్‌ఎస్ అధికార ప్రతినిధి అని, షేక్ అరీఫ్ సోషల్ మీడియా హెడ్ అని, ఇలా ప్రతి కాలనీలో ఏదో ఒక పదవిలో బిఆర్‌ఎస్ నాయకులే ఉన్నారని విమర్శించారు.

ఒకే నాయకులు కాలనీ అసోసియేషన్, ‘సిటిజన్ కౌన్సిల్‘ లాంటి బహుళ సంస్థలలో కొనసాగుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు.వెంకటేశ్వర కాలనీలో వారి ఏకపక్ష వైఖరి కారణంగానే మరో అసోసియేషన్ ఏర్పడిందని, దానికి కాంగ్రెస్ పార్టీతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తమ మిత్రుడు అయినంత మాత్రాన ఆల్ కాలనీ అధ్యక్షుడు వంశీని ఈ వివాదంలోకి లాగడం సరికాదన్నారు.

ఒక కాలనీ సభ్యుడిపై నిర్దాక్షిణ్యంగా దాడి చేసే స్థాయికి బిఆర్‌ఎస్ నాయకులు దిగజారారని, దాడికి ప్రేరేపించిన ప్రతీ ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ అవినీతి, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే బిఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్పు బురద చల్లుతున్నారని విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉండి మణికొండకు చేసిందేమీ లేదని, బిల్డర్ల దగ్గర వసూళ్లకు పాల్పడటం, అభివృద్ధి పనులను అడ్డుకోవడం తప్ప వారికి మరో చరిత్ర లేదని ఆరోపించారు. కస్తూరి నరేంద్ప మరోసారి నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని తీవ్రంగా హెచ్చరించారు.

కార్యక్రమంలో మణికొండ మున్సిపల్ అధ్యక్షుడు జితేందర్, యూత్ అధ్యక్షుడు కస్తూరి సతీష్, మాజీ కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, పురుషోత్తం, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు తాజ్ భాయ్, సీనియర్ నాయకులు యాలాల నరేష్, ముత్యాల, మాజీ ఎంపిటిసి రాజు, శ్రీనివాస్ రెడ్డి, మల్లేష్, పృథ్వీరాజ్, పార్టీ ప్రధాన కార్యదర్శి అఖిల్, యూత్ కాంగ్రెస్ సభ్యులు కస్తూరి శ్రావణ్, కస్తూరి పవన్, పవన్, కిరణ్, మహిళా నాయకురాళ్లు డాక్టర్ ప్రభావతి, సావిత్రి, మైనారిటీ నాయకులు అహ్మద్, జలాలుద్దీన్, సబేర్, మజీద్ పటేల్, మీర్ అలీ, అబ్దుల్ రెహమాన్ పాల్గొన్నారు.