27-04-2025 12:00:00 AM
ఎండాకాలం ఒంట్లోని నీరంతా వేడికి ఆవిరైపోయి శరీరం మొత్తం డీహైడ్రేట్ అయిపోతుంది. ఆ నీరసాన్ని తరిమికొట్టే ఆహారపదార్థాలు తప్పకుండా తినాల్సిందే. అందులో అన్నింటికన్నా ముందు వరుసలో ఉంటుంది కీరా దోస. వేసవి దాహాన్ని తీర్చే ఈ కీరాలో ఏమేం పోషకాలున్నాయి.. అది ఆరోగ్యానికి ఎంత అవసరమో తెలుసుకుందాం..
దాదాపు 95 శాతం నీటితోనే ఉండే కీరా దోసకాయ.. శరీరానికి కావాల్సిన నీటిని అందిస్తుంది. ఉష్ణోగ్రతనూ నియంత్రిస్తుంది. దీన్ని పోషకాల గనిగానూ చెప్పొచ్చు. బీ, సీ విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఇందులో అధికం.
బరువు తగ్గాలనుకునేవారు రోజుఊ కీరాని తినొచ్చు. క్యాలరీలు, పిండి పదార్థాలు, చక్కెర తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడంలో తోడ్పడుతుంది.
అధిక పీచుతో ఉండే కీరా జీర్ణవ్యవస్థ పనితీరుకు మేలు చేస్తుంది. ఉదర సంబంధ వ్యాధుల్నీ, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
శరీరంలోని ఇన్సులిన్ స్థాయిల్ని నియంత్రిస్తూ.. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయడం వల్ల డీహైడ్రేట్ అయ్యే మధుమేహులకు దీనివల్ల ఎంతో లాభం.
మెదడును ఆరోగ్యంగా ఉంచుతూ వయసుతోపాటు వచ్చే మతిమరుపు నుంచి కాపాడుతుంది.
దీంట్లోని యాంటీ ఆక్సిడెంట్లు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా చూడటంతో పాటు ఆ కణాల నిర్మూలనకు కీరా ఉపయగపడుతుంది.
సోడియం ఎక్కువైతే రక్తపోటు పెరుగుతుంది. పొటాషియం దీని ప్రభావాన్ని తగ్గిస్తూ రక్తపోటు పెరగకుండా చూస్తుంది. కీరాలో సోడియం తక్కువగా ఉండటం, పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రెండు రకాలుగా మేలు చేస్తుందన్నమాట. ఇంకా ఇది కొలెస్ట్రాల్ మోతాదులను తగ్గిస్తుంది.
నోటి దుర్వాసనను పోగొట్టి తాజా శ్వాసను అందించడంలో కీరా దోస బాగా పనిచేస్తుంది. ఇంకా మూత్రపిండాల్లోనూ, మూత్రాశయంలోను ఉన్న రాళ్లను కరిగిస్తుంది.
కంటి చుట్టూ నల్లటి వలయాలు, కళ్లవాపుల లాంటి సమస్యలతో బాధపడేవారు కీరా ముక్కల్ని కళ్లమీద పెట్టుకోవడం చక్కటి పరిష్కారం.
ఇలా కూడా ట్రై చేయొచ్చు..
కీరా దోసకాయ ముక్కల్ని తినడం నచ్చకపోతే దీంతో వస్తున్న చిప్స్, సిరప్స్, జ్యూసులు ఇంకా పొడుల్ని ట్రై చేయొచ్చు. మార్కెట్లో రకరకాల రెడీమేడ్ కీరా ఉత్పత్తులు దొరుకుతున్నాయి. చర్మానికి సహజమైన సౌందర్యలేపనంగా చెప్పే కీరాని బ్యూటీ ట్రీట్‌మెంట్లలోనూ ఉపయోగిస్తుంటారు. ఫేస్‌ప్యాక్‌ల దగ్గర నుంచి సబ్బు, షాంపూల వరకూ బోలెడన్నీ ఉత్పత్తులూ వచ్చేశాయి.
వంద గ్రాముల కీరాలో పోషకాలు..
శక్తి: 15 కిలోల క్యాలరీలు
నీరు: 95 గ్రా.
కొవ్వులు: 0.1 గ్రా.
పీచు: 0.5 గ్రా.
ప్రొటీన్లు: 0.7 గ్రా.
పిండిపదార్థాలు: 3.6 గ్రా.
పొటాషియం: 140 మి.గ్రా.
క్యాల్షియం: 16 మి.గ్రా.
ఫాస్ఫరస్: 25 మి.గ్రా.
మెగ్నీషియం: 13 మి.గ్రా.
విటమిన్ సి: 2.8 మి.గ్రా.