27-04-2025 12:00:00 AM
వయసు పెరుగుతున్న కొద్ది మూత్రం ఎక్కువగా రావడం సహజం. ముఖ్యంగా పురుషుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. తరచూ మూత్ర విసర్జనకు వెళ్లడం, మూత్రంలో మంట రావడం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటున్నాయా.. అయితే ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండవచ్చు. అయితే దీనికి గల చికిత్స గురించి తెలుసుకుందాం..
పురుషులకు ప్రాణాంతకరమైన ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు భారత్‌లో ఎక్కువవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. డబ్ల్యూహెచ్‌వో లెక్కల ప్రకారం.. 50 ఏళ్ల లోపు వయసున్నవారు ఈ క్యాన్సర్ బారిన పడటమూ ఎక్కువగా ఉంది. పైగా దాని తీవ్రత కూడా సాధారణం కంటే తక్కువగా ఉంటుంది. మిగిలిన వాటితో పోలిస్తే ప్రొస్టేట్ క్యాన్సర్ నెమ్మదిగా విస్తరిస్తుందని.. సమస్యలను మొదట్లోనే గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా ఈ వ్యాధి వృద్ధుల్లో మాత్రమే కనిపించేది. కాని ప్రస్తుతం యువకులను, మధ్య వయస్కులను ఎక్కువగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా మెట్రోపాలిటన్‌లలో నివసించే 34 మధ్య వయసు వారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ బాధితులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
వ్యాధిపై అవగాహన..
సమస్యను వీలైనంత త్వరగా గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రొస్టేట్ క్యాన్సర్ నుంచి బయటపడొచ్చని ఆంకాలజిస్టులు చెబుతున్నారు. క్యాన్సర్ నుంచి బతికి బయటపడటమనేది.. మనం దానిని ఎంత త్వరగా గుర్తించామనే దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రొస్టేట్ క్యాన్సర్ శరీరంలో చాలా నెమ్మదిగా విస్తరిస్తుంది. కాబట్టి తొలిదశలోనే చికిత్స తీసుకుంటే సమస్యే ఉండదు.
అమెరికాలో 80 శాతం మంది బాధితులు తొలిదశలోనే చికిత్సకు తీసుకుంటారు. 20 శాతం మందే ముదిరిపోయిన తర్వాత డాక్టర్లను సంప్రదిస్తారని పరిశోధనలు చెబుతున్నాయి. మూత్ర విసర్జన సమయంలో అసౌకర్యం కలుగుతుండటం, రాత్రుళ్లు పదేపదే లేవాల్సి రావడం, మూత్రంలో రక్తం పడటం, నడుము లేదా జననాంగం వద్ద తీవ్రంగా నొప్పి పుట్టడం ప్రొస్టేట్ క్యాన్సర్‌కు సూచన.
భయపడాల్సిన పనిలేదు..
ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలో ప్రొస్టేట్ క్యాన్సర్ రెండోది. పురుషుల్లో క్యాన్సర్ మరణాలకు కారణమవుతున్న క్యాన్సర్లలో ఇది ఆరోది. దీన్ని తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స తేలికవుతుంది. చాలావరకు నయం చేయొచ్చు కూడా. ప్రొస్టేట్ క్యాన్సర్ బాధితుల్లో మూడొంతల కన్నా ఎక్కువమంది పదేళ్లకు పైగా జీవిస్తున్నారని అధ్యయనాల్లో తేలింది. సుమారు 50 శాతం మందిలో మూడు, నాలుగో దశల్లోనే ఈ క్యాన్సర్ లక్షణాలు బయటపడుతున్నాయి.
కొన్ని మార్పులు..
రాత్రిపూట మూత్ర విసర్జనకు ఎక్కువసార్లు లేవడం తప్పించి పెద్దగా ఇబ్బందులేమీ లేనివారికి ప్రత్యేకించి మందులు అవసరం లేదు. జీవనశైలిని మార్చుకుంటే చా లావరకు ఫలితం కనిపిస్తుంది. సాయంత్రం పూట తక్కువగా నీరు తాగాలి.
పడుకునే ముందు పాల వంటివి తాగే వారు కాస్త ముందుగానే తాగాలి. విసర్జన చేశాకే నిద్రకు ఉపక్రమించాలి. మధ్యలో ఎప్పుడైనా విసర్జన చేశాక నోరు తడారినట్టు అనిపిస్తే కాస్త గొంతు తడుపుకోవచ్చు కా ని ఎక్కువగా నీరు తాగొద్దు. మధుమే హం, అధిక రక్తపోటు వంటి జబ్బులను నియంత్రిణలో ఉంచుకోవాలి. ప్రొస్టేట్ లక్షణాల విషయంలో వీటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.