22-08-2025 12:03:12 AM
ఏపుగా పెరిగిన చెట్లు.. ఆందోళన చెందుతున్న వాహనదారులు..
రేగొండ, ఆగస్టు 21(విజయ క్రాంతి); రహదారులు బాగుంటేనే ప్రయాణం సాఫీగా సాగుతుంది. మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే రహదారుల్లో ఉన్న మూల మలుపులు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి.అసలే మూల మలుపులు దీనికి తోడు వర్షాకాలం కావడంతో మలుపుల వద్ద చెట్లు ఏపుగా పెరిగి ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు ప్రయాణానికి భయపడుతున్నారు.
మండలంలో పలు మార్గాల్లో దాదాపుగా 50 కి పైగా మూలమలుపులు ఉండటం గమనార్హం. మండలంలోని తిరుమలగిరి ఆర్చి నుండి తిరుమలగిరికి వెళ్లే మార్గంలో మూడు మూల మలుపులు ఉన్నాయి.ఈ మూల మలుపుల వద్ద చెట్లు ఏపుగా పెరిగి ప్రమాదకరంగా మారాయి. దీంతో వేగంగా వచ్చే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. మండల కేంద్రం నుండి జగ్గయ్యపేట మీదుగా గోరి కొత్తపల్లి, ములుగు జిల్లాకు వెళ్లే ప్రయాణికులకు రావులపల్లి శివారు (లంబడామె కుంట) వద్ద భారీ మలుపు ఉంది.
అక్కడ గతంలో వాహన ప్రమాదాలు జరిగి ప్రయాణికులు మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి.రేగొండ టు రంగయ్య పల్లి, రేగొండ, పెద్దంపల్లి మీదుగా భాగిర్తిపేట ,చెన్నాపూర్ నుండి దామరంచ పల్లి,రేగొండ నుండి దమ్మన్నపేట ఇలా ప్రతి గ్రామానికి వెళ్లే ప్రతి రహదారికి ఎన్నో మూలమలుపులు ఉన్నాయి. కొన్ని మార్గాల్లో మలుపుల వద్ద బావులు ఉండడంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి.
కనీసం హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడంతో కొత్తగా వచ్చే ప్రయాణికులు ఇబ్బందిపడాల్సి ఉంది. గమనించక కొందరు ప్రమాదాల నుండి బయటపడితే గాయాల పాలవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సూచిక బోర్డు లతో పాటు స్పీడ్ బ్రేకర్ లు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
చెట్లు తొలగించాలి
మూల మలుపుల వద్ద చెట్లు గుబురుగా పెరగడంతో వాహనాలు దగ్గరకు వచ్చే వరకు కనిపించడం లేదు.దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.అసలే ఒక వరుస రహదారులు, పైగా రోడ్డుకు ఇరువైపులా చెట్లు ఉండడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మలుపుల వద్ద స్పీడ్ బ్రేకర్ లు వేస్తే అక్కడికి రాగానే వేగం కంట్రోల్ చేసుకుంటారు. దీంతో ప్రమాదాలు నివారించవచ్చు.
కుక్కల సిద్దు, తిరుమలగిరి హెచ్చరిక బోర్డు లు పెట్టాలి
మలుపుల వద్ద పంచాయితీ రాజ్, రోడ్లు,భవనాల శాఖ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. రేడియం తో ఉన్నవి పెడితే రాత్రి వేళల్లో వాహన దారులకు కనిపిస్తుంది. మూల మలుపుల వద్ద రహదారులను వెడల్పు చేస్తే వాహనదారులు ఇబ్బందులు పడకుండా ఉంటారు.
పెండ్యాల రాజు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి