22-08-2025 12:04:49 AM
మహబూబాబాద్, ఆగస్టు 21 (విజయ క్రాంతి): విజయ క్రాంతి పత్రికలో గత నెల 3 న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం బల్దియా పరిధిలోని ప్రధాన రహదారి ఆక్రమణలపై ‘హద్దు’ మీరుతున్నారు! శీర్షికతో ప్రచురించిన వార్తా కథనానికి ఆర్ అండ్ బి, మున్సిపల్ అధికారులు ఆర్ అండ్ బీ రోడ్డు పై ఆక్రమణ తొలగింపుకు శ్రీకారం చుట్టారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం బల్దియా పరిధిలో ఎడాపెడా రోడ్ల ఆక్రమణ, రాకపోకలకు ఆటంకం, పట్టించుకోని యం త్రాంగం తీరుపై సమగ్ర వివరాల తో వార్త కథనాన్ని విజయక్రాంతి జులై 3న ప్రచురించింది.
ఈ విషయంపై స్పందించిన ఆర్ అండ్ బీ, మున్సిపల్ అధికారులు గత పది రోజుల క్రితం పట్టణంలోని జ్యోతిబాపూలే చౌరస్తా నుంచి పొట్టి శ్రీరాములు సర్కిల్ వరకు ఆర్ అండ్ బి శాఖ గతంలో 100 అడుగుల రోడ్డుకు పరిహారం ఇచ్చిన వివరాలతో హద్దు మీరిన వారికి నోటీసులు జారీ చేశారు. వారం రోజుల గడువు పూర్తి కావడంతో బుధవారం తొలుత రోడ్డుపై ఏర్పా టుచేసిన నేమ్ బోర్డులు, హోర్డింగులను తొలగించారు.
దీనికి స్పందించిన రోడ్డుకు ఇరు వైపులా ఉన్న భవన యజమానులు ఆక్రమించి ఏర్పాటుచేసిన షెడ్లు, ఇతర నిర్మాణాలను మూడు రోజుల్లో తొలగిస్తామని అధికారులకు చెప్పడంతో అధికారులు కేవలం హోర్డింగులను తొలగించారు. గురువారం నుండి అక్రమ కట్టడాలను, షెడ్లను యజమానులే తొలగింప చేస్తున్నారు. ఆక్రమణల తొలగింపు తర్వాత 100 అడుగుల రోడ్డును విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్ అండ్ బి అధికారులు తెలిపారు.