18-08-2024 12:10:01 AM
లేని గుట్ట తొలగింపునకు రూ.80లక్షలు
మెజర్‌మెంట్ బుక్ మాయపై అనుమానాలు
పోలీసులకు కాంట్రాక్టర్ ఫిర్యాదు
ఈ వ్యవహారంపై అదనపు కలెక్టర్ సీరియస్!
కరీంనగర్, ఆగస్టు 17 (విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థలో మరో కుంభకోణం వెలుగుచూసింది. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారుల వద్ద ఉండాల్సిన ఎంబీ(మెజర్‌మెంట్ బుక్) రికార్డు మాయమవడం చర్చనీయాంశమయింది. స్మార్ట్ సిటీలో భాగంగా కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో రూ.5.80 కోట్లతో సమీకృత మార్కెట్ నిర్మాణం చేపట్టారు. ఇందుకు సంబంధించిన మొత్తం మూడు ఎంబీ రికార్డుల్లో నెం.152 కనిపించకుండా పోయింది.
ఎంబీ రికార్డు కోసం సమాచార హక్కు చట్టం కింద బీఆర్‌ఎస్‌కు చెందిన కార్పొరేటర్ బండారి వేణు దరఖాస్తు చేయడంతో ఈ విషయం బయటపడింది. మార్కెట్ నిర్మాణంలో భాగ ంగా లేని గుట్టను ఉన్నట్లు చూపి ఇందుకు 80 లక్షలు అంచనా వేసి తొలగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు మాయమైన ఎంబీ రికార్డులో ఉన్నట్లు తెలిసింది. చిన్న బండరాళ్లను తొలగించి గుట్టను తొలగించినట్లు చూపించి అవినీతికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. అయితే సదరు ఇంజనీరింగ్ అధికారి రాయి తొలగింపునకు రూ.లక్షా 99 వేలు మాత్రమే ఖర్చయిందని వివరణ ఇవ్వ డం గమనార్హం. కాగా 2022 ఫిబ్రవరిలో మార్కెట్ నిర్మాణం చేపట్టగా ఇప్పటికీ పూర్తికాలేదు. ఇప్పటి వరకు చేసిన పనుల్లో కూడా నాణ్యత లోపించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎంబీ రికార్డుపై కాంట్రాక్టర్ ఫిర్యాదు
పనులు చేపట్టిన సంబంధిత కాంట్రాక్టర్ బిల్లును పొందుపరిచే 152 ఎంబీ రికార్డు పోయిందని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం విశేషం. నిజానికి ఎంబీ రికార్డు నగరపాలక సంస్థ కార్యాలయంలో లేదా ఇంజనీరింగ్ విభాగంలోని ఏఈ దగ్గర ఉండాలి. గత సంవత్సరకాలం నుంచి ఎంబీ రాకార్డుకు సంబంధించిన వివరాలను సమాచార హక్కుచట్టం ద్వారా అడిగినప్పటికీ అధికారులు ఇవ్వలేదు. అంతేకాకుండా ఎంబీ రికార్డు పో యిందని మున్సిపల్ కమిషనర్ లేదా ఏఈ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాల్సి ఉండగా కాంట్రాక్టర్‌చేత ఫిర్యాదు చేయించ డం చర్చనీయాంశంగా మారింది. దీంతో మున్సిపల్ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ ఈ వ్యవహారంలో సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది.
భాగస్వాములైన వారిపై చర్యలు తీసుకోవాలి
ఈ అవినీతిలో భాగస్వాములైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణంలో భాగంగా అక్కడ లేని ఒక గుట్టను సృష్టించి దాని తొలగింపునకు 80 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లుగా దొంగ బిల్లులు సృష్టించి అవినీతికి పాల్పడ్డారు. ఈ అంశంలో నగర మేయర్ సునీల్‌రావు, కాంట్రాక్టర్‌తోపాటు ఒక అధికారి హస్తం ఉంది. దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.
మెండి శ్రీలత, కార్పొరేటర్, 44వ డివిజన్
కమిషనర్‌కు ఫిర్యాదు చేశాం
సమీకృత మార్కెట్ నిర్మాణంలో జరిగిన అవినీతిపై కమిషనర్‌కు ఫిర్యాదు చేశాం. ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగానికి చెందిన డీఈ, ఏఈలు కాంట్రాక్టర్‌తో కుమ్మక్కయ్యారనేది స్పష్టమవుతున్నది. అధిక అంచనాలతో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశా రు. ప్లాన్ ప్రకారం భవనం ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నా పూర్తి కాలేదు. ఇప్పటి వరకు చేసిన పనుల్లో కూడా నాణ్యత లోపం ఉంది. కాంట్రాక్టర్, సెక్షన్ ఇంజనీర్లపై అవసరమైన చర్యలు తీసుకోవాలి.
బండారి వేణు,
కార్పొరేటర్, 41వ డివిజన్