calender_icon.png 22 November, 2025 | 7:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్ధాంతరంగా నిలిచిన రోడ్లు.. అవస్థల్లో ప్రజలు

18-08-2024 12:08:28 AM

  1. బిల్లులు రాక ఆగిపోయిన పనులు
  2. నత్తనడకన మరమ్మతులు 
  3. బిల్లుల కోసం ఆఫీసుల చుట్టూ కాంట్రాక్టర్ చక్కర్లు
  4. కామారెడ్డి జిల్లాలో అవస్థలు పడుతున్న ప్రజలు

కామారెడ్డి,ఆగస్టు 16 (విజయక్రాంతి): నిధులు విడుదల కాకాపోవడంతో కామారెడ్డి జిల్లాలో పలు చోట్ల రోడ్లు మరమ్మత్తుల పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.   దీంతో ఆ రోడ్ల పై ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని గాంధారి రోడ్డులో చిన్న పోతంగల్ నుంచి సర్వాపూర్ వరకు రోడ్డు రిపేర్ పనులకు గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరయ్యాయి. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్  మూడు నెలల పాటు పనులు చేశాడు.

ఇంతలో ప్రభుత్వం మారడంతో నిధులు విడుదల కాలేదు. దీంతో పనులను కాంట్రాక్టర్ నిలిపివేశారు.ఇప్పటికే అప్పులు తెచ్చి పనులు చేశామని, వాటికి వడ్డిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేశాడు.  చేసిన పనులకైనా బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ కోరారు.  నిధులు విడుదల కాకపోవడంతో రోడ్డు పనులను అర్ధాంతరంగా కాంట్రాక్టర్ నిలిపివేశారు. బిల్లుల కోసం ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. 

ప్రయాణికుల అవస్థలు

 ఖండే బల్లూరు , కామారెడ్డి మండలం క్యాసంపల్లి రోడ్డు నుంచి ముత్యంపేట మీదుగా దోమకొండ వరకు, రామారెడ్డి రోడ్డు డబుల్ రోడ్డు పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. అలాగు దోమకొండ నుంచి ఎల్పుగొండ రోడ్డు  పనులు కూడా నిలిచిపోయాయి. కాళోజీవాడి నుంచి ధర్మారావుపేట్ రోడ్డు పనులు కూడా పూర్తికాలేదు. రామారెడ్డి గ్రామాల మధ్య నిర్మించిన కల్వర్టు పనును కాంట్రాక్టర్ నిలిపి వేశారు. దీంతో వర్షం పడితే ఆయా రోడ్డుపై  వెళ్లాలంటే  ప్రయాణం నరకప్రాయంగా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు నిధులు విడుదల చేయించి పనులు ముందుకు సాగేలా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.  ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు స్పందించి నిలిచిపోయిన పనులను పూర్తిచేయాలని కోరుతున్నారు.  

రోడ్డుపై పడిలేస్తూ పోతున్నం

క్యాసంపల్లి నుంచి ముత్యంపేట వరకు డబుల్ రోడ్డు  మరమత్తు పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.  వర్షం పడితే బైక్ పై వెళ్లితే రోడ్డుపై పడి లేచి పోవాల్సి వస్తుంది. నిధులు లేక పనులు చేయడం లేదని కాంట్రాక్టర్ అంటున్నారు.అధికారులు పట్టించుకోవడం లేదు.ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తేనే పనులు ముందుకు సాగుతాయని కాంట్రాక్టర్ జవాబు ఇస్తున్నాడు. నిత్యం పనులపై కామారెడ్డికి వెళ్లే వారందరు అవస్థలు పడుతున్నారు.అధికారులు స్పందించి పనులు పూర్తి చేయించాలి.

స్వామిగౌడ్, ముత్యంపేట్, కామారెడ్డి జిల్లా

నిధులు రాగానే పనులు పూర్తవుతాయి

జిల్లాలో ప్రధాన రోడ్ల మరమ్మతు పనులు నిలిచిపోయాయి. నిధులు రాగానే పనులు చేస్తామని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. నిధులు లేక పనులు  సాగడం లేదు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. కాంట్రాక్టర్లు ఇప్పటి వరకు చేసిన పనులకు బిల్లులు వస్తే పనులు చేస్తామని చెబుతున్నారు.ఈవిషయాన్ని ప్రజాప్రతినిధులు, కలెక్టర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.  త్వరలో నిధులు విడుదల అవుతాయి.  నిధులు రాగానే పనులు పూర్తి చేయిస్తాం.

ఈఈ, కామారెడ్డి