02-12-2025 01:30:44 AM
రైతుల వద్ద ఉన్న పత్తిని మొత్తం కొనుగోలు చేస్తాం: తుమ్మల
హైదరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాం తి): సీసీఐ, జిన్నింగ్ మిల్లర్ల మధ్య చర్చలు సఫలం కావడంతో తెలంగాణలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. దీంతో పత్తి కొనుగోళ్లపై సీసీఐ, జిన్నింగ్ మిల్లర్ల మధ్య నెలకొన్న వివాదాలకు తెరపడినట్లయింది. సీసీఐ విధించిన కొన్ని కఠిన నిబంధనలను మిల్లర్లు తీవ్రంగా వ్యతిరేకించడంతో రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. పత్తి రైతులు ఆందోళన బాటపట్టారు.
అయితే ఈ వివాదంపై మం త్రి తుమ్మల నాగేశ్వరరావు జోక్యం చేసుకొని సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లర్లతో పలుమార్లు చర్చలు జరిపారు. కేంద్ర మంత్రులు, సీసీఐ సీఎండీ, ఇత ర అధికారులతో మాట్లాడిన మంత్రి తుమ్మల నిబంధనల్లో మార్పులు చేయించారు. ఫలితంగా రాష్ట్రంలో నోటిఫై చేసిన 330 జిన్నింగ్ మిల్లులన్ని మళ్లీ పత్తి కోనుగోళ్లను ప్రారంభించాయి. ఇప్పటీ వరకు రాష్ట్రంలో సీసీఐ 4.03 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని సేకరించాయి.
జిన్నింగ్ మిల్లులు, సీసీఐ మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి మంత్రి చొరవకు జిన్నింగ్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయ ంతో వేలాది మంది రైతులకు, మిల్లుల కార్మికులకు ఉపశమనం లభించిందన్నారు.