07-05-2025 12:05:57 AM
-భద్రతా మండలిలో భారత్‌ను దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన పాకిస్థాన్.. బెడిసికొట్టిన వ్యూహం
-వరుసగా 12వ రోజూ సరిహద్దుల వెంబడి కాల్పులు
న్యూయార్క్, మే 6: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా ఉన్న పాకిస్థాన్ భారత్‌ను ఏకాకిని చేయాలని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. మంగళవారం 90 నిమిషాల పాటు భద్రతా మండలిలోని 15 సభ్యదేశాల ప్రతినిధులు సమావేశం అయ్యారు. పాకిస్థాన్ తరఫున ఈ సమావేశానికి అసీమ్ ఇఫ్తికార్ అహ్మద్ హాజరయ్యారు.
ఈ సమావేశంలో భారత్‌ను దోషిగా నిలబెట్టాలని పాక్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టి.. సభ్యదేశాల ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాకిస్థాన్ ఇటీవల నిర్వహించిన అణుపరీక్షల గురించి సభ్యదేశాలు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. దీంతో సమధానం చెప్పలేక పాక్ ప్రతినిధి నీళ్లు నమిలారు. భారత్ కుట్రలు చేసి పహల్గాం దాడి చేసుకుని పాకిస్థాన్‌పై నిందలు మోపుతోందని వాదించగా.. సభ్యదేశాలు ఆ వాదనను కూడా తిరస్కరించాయి. భారత్‌తో చర్చల ద్వారానే సమస్య ను పరిష్కరించుకోవాలని పాకిస్థాన్‌కు అనేక సభ్యదేశాలు సలహా ఇచ్చినట్టు సమాచారం.
ఆగని కాల్పులు
పాకిస్థాన్ సరిహద్దుల వెంట కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. వరుసగా 12వ రోజు కూడా పాక్ రేంజర్లు నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు దిగారు. కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరీ, నౌషెరా, సుందర్‌బనీ, అక్నూర్ సెక్టార్లలో కాల్పులు జరపగా.. భారత సైన్యం సమర్థవంతంగా బదులిచ్చింది.