calender_icon.png 30 December, 2025 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాబ్ ఎక్కుతారా.. కోర్టు మెట్లెక్కుతారా?

29-12-2025 12:00:00 AM

మా డాడీ ఎవరో తెలుసా.. అంటే కుదరదు

లాయర్‌ను వెతకడం కంటే.. గూగుల్‌లో క్యాబ్‌ను వెతకడం మిన్న

మియా.. స్టీరింగ్‌కు సలాం కొట్టి సైలెంట్‌గా ఇంటికి పో..

న్యూ ఇయర్ వేళ మందుబాబులకు సీపీ సజ్జనార్ స్వీట్ వార్నింగ్

హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 28 (విజయక్రాంతి): సాధారణంగా న్యూ ఇయ ర్ వేళ పోలీసులు ఏం చేస్తారు.. లాఠీలు పట్టుకుని రోడ్ల మీద బారికేడ్లు పెడతారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో దొరికిన వారిపై కేసులు రాస్తారు. కానీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ రూటు మార్చారు. లాఠీ కంటే సెటైర్ పదునుగా ఉంటుందని నమ్మారు. అందుకే మందుబాబుల గుండె ల్లో రైళ్లు పరిగెత్తించేలా, అదే సమయంలో ఆలోచింపజేసేలా సోషల్ మీడియా వేదికగా వినూత్న ప్రచారానికి తెరలేపారు. ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన ట్వీట్లు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. పక్కా హైదరాబాదీ యాసలో.. స్నేహపూర్వకంగా చెబుతూనే, రూల్స్ బ్రేక్ చేస్తే చుక్కలు కనిపిస్తాయని సీపీ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

మా డాడీ ఎవరో తెలుసా..?

హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడగానే చాలామంది యువకులు చేసే మొదటి పని.. మా డాడీ ఎవరో తెలుసా.. మా అంకుల్ ఎమ్మెల్యే తెలుసా.. మా అన్న మినిస్టర్ పీఏ తెలుసా..అంటూ పోలీసులను బెదిరించే ప్రయత్నం చేస్తారు. దీనిపై సీపీ సజ్జనార్ పేల్చిన సెటైర్ మామూలుగా లేదు. దయచేసి మా ఆఫీసర్లను మా డాడీ ఎవరో తెలుసా.. అని అడగొద్దు. మేము మీ ప్రైవసీని గౌరవిస్తాం. మీరెవరో మాకు అనవస రం. మీ వాహనం పక్కన పెట్టి వెళ్లండి. మళ్లీ డేట్ వచ్చాక కోర్టులోనే జడ్జి గారికి పరిచయం చేసుకుందాం. పరపతి ఉందనో, పెద్దల అండ ఉందనో రూల్స్ అతిక్రమిస్తే ఊరుకునేది లేదని, డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో హైదరాబాద్ పోలీసులది జీరో టాలరెన్స్ విధానమని ఈ ఒక్క ట్వీట్‌తో స్పష్టం చేశారు.

మియా.. స్టీరింగ్‌కు సలాం కొట్టు..

హైదరాబాదీ లోకల్ టచ్ ఇస్తూ.. యువతకు కనెక్ట్ అయ్యేలా మరో ట్వీట్ చేశారు. మియా.. డ్రింక్ చేశావా అయితే స్టీరింగ్‌కు సలాం కొట్టి, వెనుక సీట్లో కూర్చొని క్యాబ్‌లో వెళ్లు. మద్యం మత్తులో స్టీరింగ్ పడితే ప్రాణాలకే ముప్పు అని, డ్రైవింగ్ సీటుకు దూరంగా ఉండటమే మంచిదని పక్కా మాస్ స్టుల్‌లో హెచ్చరించారు. 

అప్రమత్తంగా ఉండండి

సీపీ సజ్జనార్ ట్వీట్లు కేవలం నవ్వించడానికే కాదు, వాటి వెనుక హెచ్చరిక కూడా ఉంది. న్యూ ఇయర్ సందర్భంగా నగర వ్యాప్తంగా వందల సంఖ్యలో డ్రంక్ అండ్ డ్రైవ్ బృందాలు పనిచేయనున్నాయి. 

లాయర్ కావాలా.. క్యాబ్ కావాలా..?

మందు కొట్టి చిందేసి, సొంత కారులో ఇంటికి వెళ్తామంటే కుదరదని సీపీ తేల్చిచెప్పారు. దీనిని ఆయన ఒక సింపుల్ లాజిక్ తో వివరించారు. లాయర్ కోసం వెతకడం కంటే.. గూగుల్‌లో క్యాబ్ కోసం వెతకడం చాలా ఉత్తమం. మందు తాగి డ్రైవ్ చేస్తూ పోలీసులకు చిక్కితే.. కారు సీజ్ అవుతుంది. మరుసటి రోజు పోలీస్‌స్టేషన్ల చుట్టూ, ఆ తర్వాత కోర్టుల చుట్టూ తిరగాలి. లాయర్లకు ఫీజులు, కోర్టులో జరిమానాలు కట్టాలి. ఇదంతా ఎందుకు దండగ.. సింపుల్‌గా రూ. 500 పెట్టి క్యాబ్ బుక్ చేసుకుంటే రాచమర్యాదలతో ఇంటికి వెళ్లొచ్చని ఆయన వినూ త్నంగా సూచించారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు వాహ్.. సీపీ సార్ మాంచి లాజిక్ చెప్పారు అంటూ కామెంట్ చేస్తున్నారు.