calender_icon.png 11 August, 2025 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాపన్న స్ఫూర్తితోనే రాజ్యాధికారం

11-08-2025 01:32:34 AM

  1. గీతవృత్తిదారులకు అండగా ఉంటాం 
  2. 40 లక్షల ఈత మొక్కలు నాటుతున్నాం 
  3. హైదరాబాద్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం  
  4. మంత్రి పొన్నం ప్రభాకర్
  5. బీసీ ముఖ్యమంత్రి వస్తారు : పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్

హైదరాబాద్,సిటీబ్యూరో అగస్టు 10 (విజయక్రాంతి): బడుగు, బలహీన వర్గాలను ఏకం చేసి రాజ్యాధికారాన్ని సాధించిన బ హుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, ఆయన స్ఫూర్తితోనే నేటి సమా జం ముందుకు సాగాలని  బీసీ సంక్షేమ శా ఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చా రు. ఐక్యంగా ఉండి సమస్యలపై పోరాటం చేయాలని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ నగర నడిబొడ్డున పాపన్నగౌడ్ విగ్ర హాన్ని ఏర్పాటు చేసే బాధ్యత తాను, పీసీసీ అధ్యక్షులు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

రవీంద్రభారతిలో  సర్దార్ పాపన్న మహారాజ్ ధర్మ పరిపాలన సంస్థ , జై గౌడ్ ఉద్యమం జాతీయ కమిటీ సంయుక్తంగా నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి జాతీయ వారోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి.  కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్య క్షుడు మహేశ్‌గౌడ్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్‌గౌడ్, మాజీ మంత్రులు వి. శ్రీనివాస్‌గౌడ్, జోగి రమేశ్, మాజీ ఎంపీ భ రత్ గౌడ్, గుల్బర్గా ఎమ్మెల్సీ జయదేవ్ గుత్తా తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

సామాజిక వర్గాలను కలుపుకొని 

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని వెళ్లినప్పుడే సర్వాయి పాపన్న ఆశయాలను ముందుకు తీసుకుపోయిన వాళ్లం అవుతామన్నారు. “పోటీ ప్రపంచంలో మన పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి, ఉపాధి అవకాశాలు పెంచుకుని ఆర్థికంగా ఎదగాలి. వృత్తి బంధువులకు నేను ఎల్లప్పుడూ అండగా ఉంటా. నన్ను నేరుగా కలవలేని వారి సమస్యలను కులపెద్దలు నా దృష్టికి తీసుకు రావాలని భరోసా ఇచ్చారు.

హుస్నాబాద్‌లోని సర్వాయిపేటలో పాపన్న గౌడ్ కోట అభివృద్ధికి రూ. 5 కోట్లు కేటాయించామన్నారు. ఈ నెల 17న సైదాపూర్‌లో పాపన్న విగ్రహావిష్కరణ చేస్తున్నామన్నారు. కోకాపేటలో కేటాయించిన స్థలంలో ఏం చేయాలో అందరం కలిసి నిర్ణయించుకుందామని, యాదగిరిగుట్ట, వేములవాడలో సత్రాలు నిర్మించామన్నారు. త్వరలో జోగులాంబలో కూడా నిర్మిస్తామని వెల్లడించారు. 

40 లక్షల ఈత మొక్కలు

గీత వృత్తిదారులకు చేయూతనిచ్చేందుకు ఈ ఏడాది రాష్ర్టవ్యాప్తంగా 40 లక్షల ఈత మొక్కలను నాటుతున్నామని మంత్రి ప్రకటించారు. ‘కాటమయ్య రక్షణ కవచాల’ పంపిణీ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లానని, వృత్తిదారుల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని  స్పష్టం చేశారు.

కాంగ్రెస్ నుంచి బీసీ ముఖ్యమంత్రి: మహేశ్‌గౌడ్

ముఖ్య అతిథిగా హాజరైన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాల్లో బీసీ నేతలు ముఖ్యమంత్రులు అయ్యారని, కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ అవకాశం ఇప్పటికీ దక్కలేదన్నారు. రాహుల్ గాంధీ ఆశయ సాధనలో భాగంగానే కాంగ్రెస్ నుంచి బీసీ ముఖ్యమంత్రి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో బీజేపీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని మండిపడ్డారు.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తికమక పెట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో కల్లు కాంపౌండ్లపై కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.  మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఇతర నేతలు మాట్లాడుతూ, సర్వాయి పాపన్న స్ఫూర్తిని కొనసాగిస్తూ గౌడ సమాజ ఐక్యతకు, అభివృద్ధికి పాటుపడతామన్నారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శులు వట్టికూటి రామారావు గౌడ్, మధు సత్యం గౌడ్, వివిధ పార్టీలకు చెందిన గౌడ్ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.