01-07-2025 10:44:18 PM
చండూరు (విజయక్రాంతి): గ్రామాల్లో ఒకప్పుడు కిరాణా షాపుల్లో కూల్‌డ్రింక్‌ల మాదిరిగా మద్యం ఎప్పుడైనా అందుబాటులో ఉండేది. "బెల్ట్ షాపులు" పేరుతో నిబంధనలకు విరుద్ధంగా జరిగే ఈ అక్రమ విక్రయాలపై ఇప్పుడు గట్టిగా కట్టడి ఏర్పడిందని చండూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆదిరెడ్డి(Circle Inspector Adireddy) తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన, బెల్ట్ షాపుల నిర్మూలన తరువాత చండూరు సర్కిల్ పరిధిలో కొట్లాట కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని వెల్లడించారు. ఈ ప్రాంతం సాధారణంగా శాంతియుతంగా ఉండే మండలమని, జిల్లాలో ఇతర మండలాలతో పోలిస్తే ఇక్కడ నేరాల సంఖ్య తక్కువగా ఉండటం సంతృప్తికరమని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎక్సైజ్, పోలీస్ శాఖలతో సమన్వయంతో బెల్ట్ షాపుల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దీంతో మద్యం ఆధారిత కుటుంబ కలహాలు, రోడ్డు ప్రమాదాలు, ఆస్తి వివాదాల వంటి సంఘటనలు తగ్గుముఖం పట్టాయని వివరించారు. గంజాయి, డ్రగ్స్‌ల విషయంలో చండూరులో అంతగా లభ్యత లేదని, కానీ హైదరాబాదు, ఇతర ప్రాంతాల నుంచి వస్తాయని తెలిపారు. ఈ విషయంపై పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతూ, అనుమానితులను టెస్టు కిట్లతో పరీక్షించి పాజిటివ్ అయితే కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు.