01-07-2025 10:47:06 PM
మానవ హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర కార్యదర్శి పూనెం ప్రదీప్ కుమార్ డిమాండ్...
భద్రాచలం (విజయక్రాంతి): గత ఇరవై సంవత్సరాలుగా కొబ్బరికాయల వ్యాపారం నిర్వహించుకుంటున్న వారిపై దౌర్జన్యం చేసి ఆ షాపులను కూల్చివేయటం అమానుషమని, తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల పరిరక్షణ సంస్థ(Human Rights Protection Organization) రాష్ట్ర కార్యదర్శి పూనెం ప్రదీప్ కుమార్ డిమాండ్ చేశారు. భద్రాచలం పట్టణాన్ని గోదావరి వరదల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం కరకట్ట నిర్మించిందని, కరకట్ట నిర్మాణం సమయంలో ప్రభుత్వం భూమిని సేకరించి మిగిలిన భూమిని ఇరిగేషన్ శాఖకు అప్పజెప్పడం జరిగిందన్నారు.
అప్పటి నుండి ఆ స్థలంలో కొంతమంది నిరుపేద వ్యక్తులు కొబ్బరికాయల వ్యాపారం నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నారని అన్నారు. అయితే ఒక వ్యక్తి తాను నిర్మించే భవనానికి అడ్డుగా ఉన్నాయని షాకుతో పేద ప్రజలు నిర్వహించుకుంటున్న కొబ్బరి కాయల షాపులను అత్యంత దుర్మార్గంగా వర్షం వచ్చే సమయంలో కూల్చివేయడం దారుణమన్నారు. వయసులో పెద్దవారు అనే ఆలోచన విచక్షణ లేకుండా షాపులను కూల్చడం సరికాదని, జోరు వర్షంలో తడుచుకుంటూ వృద్దులు విలపించడం బాధాకరమన్నారు. షాపులు తీసివేస్తే వారికి ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని ప్రదీప్ కోరారు.