18-06-2025 12:01:37 AM
తెలుగులో ఎన్నో సినిమాలు చేసి ఇక్కడి ప్రేక్షకుల గుండెల్లో అందాల తారగా చోటు సంపాదించుకుంది అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రవీణ్ నారాయణ్ తెరకెక్కిస్తున్న థ్రిల్లర్ చిత్రంలో నటిస్తోంది. అదే ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’. సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తుందనేది ఈ మూవీ టైగ్‌లైన్. అనుపమ ఇందులో జానకి అనే ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఇంకా ఇందులో ప్రముఖ నటుడు సురేశ్ గోపి న్యాయవాది పాత్రలో నటిస్తున్నారు. జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న అనుపమ.. తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న విమర్శల గురించి చెప్పుకొచ్చింది. “వాస్తవానికి మలయాళంలో తక్కువ చిత్రాలు చేసిన నేను ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’తో మలయాళ ప్రేక్షకుల ఆదరణ పొందుతానని నమ్మకంగా చెప్పగలను. ఇది గొప్ప చిత్రం. చాలామంది నాకు నటించడమే రాదంటూ ట్రోల్ చేస్తున్నప్పటికీ దర్శకుడు ప్రవీణ్ ఇందులో నన్ను ఎంపిక చేసుకున్నారు.
కొవిడ్ సమయంలో నా కెరీర్ పరంగా, జీవితంలోనూ ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా. నాపై నమ్మకంతో ఇలాంటి పాత్రను ఇవ్వడమే నాకు దక్కిన విజయంగా భావిస్తున్నా. అయితే, విమర్శలు నన్ను ఒకింత ఆలోచనలో పడేశాయి. అందుకే ప్రేక్షకులకు నచ్చే సినిమాలే అంగీకరించాలని నిర్ణయించుకున్నా. నాకు మద్దతు ఇచ్చినవారికి, నన్ను ద్వేషించిన వారికి కృతజ్ఞతలు” అని చెప్పింది.