21-11-2025 01:18:21 AM
చేనేత జౌళీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి) : కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా నేతన్న రుణమాఫీ ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి రూ. 33 కోట్లు విడుదల చేశారని జౌళీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నేతన్న సంక్షేమం కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డికి నేత కార్మికుల తరఫున మంత్రి తుమ్మల ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వ నిర్ణయాల వలన నేత కార్మికులకు నిరంతర ఉపాధి లభిస్తోందని, అందులో భాగంగా టెస్కోకు రూ.588 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయని తెలిపారు. సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, హన్మకొండ జిల్లాల్లోని 130 ఎంఏసీఎస్, 56 ఎస్‌ఎస్‌ఐ యూనిట్ల ద్వారా ఇందిరా మహి ళా శక్తి పథకం కింద సహాయక సంఘాల మహిళా సభ్యులకు అందించే చీరల ఉత్పత్తి జరిగిందని తెలిపారు.
నేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం రూ.168 కోట్లతో తెలంగాణ చేనేత అభయహస్తం పథకంలో భాగంగా మూడు ముఖ్య మైన పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. నేతన్న భరోసా పథకంలో భాగంగా కనీసం 50 శాతం ఉత్పత్తి చేసిన నేత కార్మికులకు ఏడాదికి రూ.18,000, అనుబంధ కార్మికులకు రూ.6,000 ప్రోత్సాహం అంది స్తున్నట్టు పేర్కొన్నారు.