calender_icon.png 23 May, 2025 | 11:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేషనల్ హెరాల్డ్ ఆస్తుల ద్వారా 142 కోట్లు లబ్ధి

22-05-2025 01:33:46 AM

-సోనియా, రాహుల్‌గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

-ఢిల్లీ ప్రత్యేక కోర్టులో వాదనలు

న్యూఢిల్లీ, మే 21: నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంచలన ఆరోపణలు చేసింది. ఈ నేరంలో వారు రూ.142 కోట్ల లబ్ధి పొందారని ఆరోపించింది. ఢిల్లీ ప్రత్యేక కోర్టులో బుధవారం విచారణ జరగగా.. ఈడీ తన వాదనలు వినిపించిది.

ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు వాదనలు వినిపించారు. 2023, నవంబర్‌లో నేషనల్ హెరాల్డ్‌తో ముడిపడి ఉన్న విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసే వరకూ దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని సోనియా, రాహుల్ అనుభవించారని కోర్టుకు తెలిపారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సం బంధించి మనీ లాండరింగ్ ఆరోపణలతో కాం గ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ అధికారులు గతంలో పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే.

సీబీఐ విచారణ మధ్యలోనే నిలిచినప్పటికీ.. ఈడీ దర్యాప్తు మాత్రం కొనసాగుతోంది. ఈ కేసులో 2023, నవంబర్‌లో జప్తు చేసిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.661 కోట్ల విలువైన ఆస్తు ల స్వాధీనానికి చర్యలు ప్రారంభించింది. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ.. అందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురి పేర్లను పేర్కొంది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు లో ప్రాసిక్యూషన్ కంప్లయింట్ దాఖలు చేయగా, తాజాగా దీనిపై విచారణ జరిగింది.