calender_icon.png 5 January, 2026 | 9:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుక్కి దున్నకుండానే సాగు!

04-01-2026 12:00:00 AM

దుక్కి దున్నకుండానే, గత పంట అవశేషాలు అలాగే ఉంచి, ప్రత్యేక సీడ్ డ్రిల్, ప్లాంటర్తో మొక్క జొన్న విత్తనాలు (జీరో టీల్లేజీ) నాటే పద్ధతి ద్వారా ఈ రబీ సీజన్‌లో మొక్కజొన్న పంట సాగుకు ఎంతో మేలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. దుక్కి దున్నే ఖర్చులు తగ్గడంతో పాటు, వంటకాలం కలిసి రావడం, అధిక దిగుబడి సాధించడం, పెట్టుబడికి రెట్టింపు ఆదాయం లభించడం, నీటి తడుల సంఖ్య తగ్గడం తదితర అంశాలు రైతులకు కలిసి వస్తాయని చెబుతున్నారు.

  1. మొక్కజొన్నలో తక్కువ పెట్టుబడి.. అధిక దిగుబడి 
  2. రబీలో ప్రయోజనకరం

వానాకాలం సాగుచేసిన వరి పంట అవశేషాలను కాల్చకుండా పొలంలోనే ఉంచాలి. కలుపు ఎక్కువగా ఉంటే విత్తే ముందు నాన్ సెలెక్టివ్ హెర్బిసైడ్ (గ్లైఫోసేట్) వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన మోతాదులో పిచికారీ చేయాలి.

విత్తనం విత్తే పద్ధతి

జీరో టిల్ సీడ్ డ్రిల్, రోటరీ ప్లాంటర్ ఉపయోగించాలి.

వరుసల మధ్య దూరం: 6,075 సెం.మీ, మొక్కల మధ్య: 2,025 సెం.మీ

విత్తే లోతు: 45 సెం.మీ ఉండాలి.

విత్తన మోతాదు: హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాలు ఎకరానికి 8 నుంచి10 కిలోలు అవసరం.

ఎరువుల యాజమాన్యం

నైట్రోజన్ హెక్టార్‌కు120 నుంచి 150 కిలోలు, ఫాస్ఫరస్: 60 కిలోలు, పొటాష్: 40 కిలోలు విత్తే సమయంలో కొంత, 30 నుంచి 35 రోజులకు మిగిలినది వినియోగించాలి.

నీటి యాజమాన్యం: దున్నని పొలాల్లో తేమ ఎక్కువగా నిలుస్తుంది. అందువల్ల అవసరానికి మించి నీరు పెట్టకూడదు. 

రైతుకు లభించే ప్రయోజనాలు

దుక్కి దున్నే ఖర్చు ఉండదు. మట్టిలో తేమ ఎక్కువసేపు నిలిచి నీటి అవసరం తగ్గుతుంది. మట్టి ఆరోగ్యం మెరుగుదల ఉంటుంది. సేంద్రియ పదార్థం పెరుగుతుంది. మట్టి కణాలు చెదరకుండా ఉంటాయి. పంట త్వరగా వేయొచ్చు. దిగుబడి స్థిరత్వంగా వస్తుంది. సరైన నిర్వహణతో సాధారణ దున్నే పద్ధతితో సమానంగా లేదా కొంచెం ఎక్కువ దిగుబడి వస్తుంది.

పర్యావరణ లాభాలు: అవశేషాలు కాల్చకపోవడం వల్ల కాలుష్యం తగ్గుతుంది. కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. 

 బండి సంపత్ కుమార్, మహబూబాబాద్, విజయక్రాంతి

జీరో టీల్లేజీ సాగుకు అనుకూలం

మహబూబాబాద్ జిల్లాలో వాన కాలంలో వరి పంట సాగుచేసిన భూముల్లో నీటి వనరులు ఉన్నచోట జీరో టీల్లేజీ ద్వారా మొక్కజొన్న సాగు చేయడానికి అనుకూలం. జీరో టీల్లేజీ మొక్కజొన్న పంట సాగు వల్ల రైతులకు విత్తన ఖర్చు తగ్గుతుంది.

ముఖ్యంగా దుక్కి దున్నే అవసరం ఉండదు. నీటి తడుల సంఖ్య తగ్గుతుంది. పంటకాలం కూడా కలిసి వస్తుంది. దిగుబడి అధికంగా వస్తుంది. మేలైన యాజమాన్య పద్ధతులతో మొక్కజొన్న సాగుతో అధిక ఆదాయం పొందవచ్చు. భూసార పరిరక్షణ, కాలుష్య నివారణకు జీరో టీల్లేజీ సాగు దోహదపడుతుంది. 

 రాజు, బయ్యారం వ్యవసాయాధికారి