04-01-2026 12:00:00 AM
పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు కృషి
సాధారణంగా పట్టణాల్లోని వీధులకు దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన స్వతంత్ర సమరయోధుల పేర్లు, లేదంటే విశేషంగా ప్రజాసేవకు అంకితమైన వారి పేర్లు పెట్టడం సర్వసాధారణం. అయితే మహబూబాబాద్ జిల్లాలో ఇందుకు భిన్నంగా తమకు నిలువ నీడ కల్పించిన వారిని నిరంతరం గుర్తుంచుకునే విధంగా వారి పేర్లను కాలనీలు, వీధులకు పెట్టడం ప్రత్యేకతగా నిలుస్తోంది.
వందల మందికి ఇళ్ల స్థలాలు
మహబూబాబాద్ జిల్లాగా ఏర్పడక ముందు తాలూకా, మున్సిపాలిటీగా ఉన్న సమయంలో వివిధ పార్టీల నాయకులు పేదలకు ప్రభుత్వ స్థలాల్లో నిలువ నీడ కల్పించే విధంగా కృషి చేశారు. ఇదే కోవకు చెందిన సీపీఎం నేత ఆకుల లక్ష్మయ్య, సీపీఐ నేత బ్రాహ్మణపల్లి ధర్మయ్య, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్య మానుకోటలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు, పలు చోట్ల పేదలకు ఇండ్ల స్థలాలు ఇప్పించేందుకు కృషి చేశారు. వీరి కృషి వల్ల వందల మందికి మానుకోట పట్టణంలో పలుచోట్ల నిలువ నీడ దక్కింది. వారి కృషికి గుర్తుగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో కాలనీలు, వీధులకు వారి పేర్లను నిర్ణయించి, నిరంతరం గుర్తుంచుకునే విధంగా నేమ్ బోర్డులు కూడా ఏర్పాటు చేయడం విశేషం.
బండి సంపత్ కుమార్, మహబూబాబాద్, విజయక్రాంతి