calender_icon.png 24 December, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాక్సింగ్ డే టెస్టుకు కమ్మిన్స్ దూరం

24-12-2025 12:19:59 AM

  1. ఆసీస్ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్
  2. లియోన్ స్థానంలో మర్ఫీ

మెల్‌బోర్న్, డిసెంబర్ 23: యాషెస్ సిరీస్‌ను మరో రెండు టెస్టులు మిగిలుండగానే కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా బాక్సింగ్ డే మ్యాచ్‌కు రెడీ అవుతోంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆసీస్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. మెల్‌బోర్న్ వేదికగా జరగబోయే నాలుగో టెస్టు కోసం క్రికెట్ ఆస్ట్రేలియా 15 మందితో జట్టును ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.

అతడి స్థానంలో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ తాత్కాలిక సారథిగా బాధ్యతలు అందుకోనున్నాడు. అనారోగ్యంతో మూడో టెస్టుకు దూరమైన స్మిత్ ప్రస్తుతం ఫిట్‌నెస్ సాధించాడు. గత కొంతకాలంగా కమ్మిన్స్ నడుంనొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే పలు సిరీస్‌లకు దూరమయ్యాడు. యాషెస్ తొలి రెండు టెస్టుల్లోనూ అతను ఆడలేదు. ఫిట్‌నెస్ సాధించి మూడో టెస్టులో ఆడాడు. ఇప్పుడు ఆసీస్ యాషెస్‌ను సొంతం చేసుకోవడం, మరో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్ ఉండడంతో కమ్మిన్స్‌కు విశ్రాంతినివ్వాలని నిర్ణయించారు. 

ఇదిలా ఉంటే మూడో టెస్టులో గాయపడిన స్పిన్నర్ నాథన్ లియోన్ కూడా బాక్సింగ్ డే మ్యాచ్‌కు అందుబాటులో లేడు. అతడి స్థానంలో యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీకి చోటు దక్కింది. కమ్మిన్స్ స్థానంలో రిచర్డ్‌సన్ చోటు దక్కించుకున్నాడు. రిచర్డ్‌సన్ ఆసీస్ తరపున చివరిసారిగా 2021లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నాడు. కాగా ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌లో ప్రస్తుతం ఆస్ట్రేలియా 3-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. బ్యాటర్ల పేలవ ప్రదర్శనతో సిరీస్ చేజార్చుకున్న ఇంగ్లాండ్ మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది.