24-12-2025 12:21:58 AM
విశాఖపట్నం, డిసెంబర్ 23: సొంతగడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇటీవలే వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత వుమెన్స్ టీమ్ తాజాగా శ్రీలంకతో జరుగుతున్న ఐదు టీ ట్వంటీల సిరీస్‌లో దుమ్మురేపుతోంది. తొలి మ్యాచ్ తరహాలోనే రెండో టీ ట్వంటీలోనూ వన్ సైడ్ విక్టరీ అందుకుంది. విశాఖ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. బౌలింగ్‌లో వైష్ణవి శర్మ, శ్రీచరణి. బ్యాటింగ్‌లో షెఫాలీ వర్మ మెరుపులు హైలైట్ గా నిలిచాయి.
మొదట బ్యాటింగ్‌కు శ్రీలంక ఆరంభంలోనే 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ గుణరత్నే తొలి ఓవర్లోనే ఔటవగా.. దూకుడుగా ఆడుతున్న చమరి ఆటపట్టును స్వేహరాణా పెవిలియన్‌కు పంపింది. అయితే తర్వాత హాసిని పెరీరా, హర్షిత కాసేపు నిలకడగా ఆడడంతో శ్రీలంక మంచి స్కోరు సాధించేలా కనిపించింది. 10 ఓవర్ల తర్వాత భారత బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. స్పిన్నర్లు వైష్ణవి శర్మ, శ్రీచరణి కీలక సమయాల్లో వికెట్లు కూడా పడగొట్టారు. ఫలితంగా లంక బ్యాటర్లు పరుగులు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఒక దశలో సింగిల్స్ కూడా రావడం గగనమైంది.
చివరి వరకూ భారత బౌలర్లు పట్టుసడలించకుండా బౌలింగ్ చేయడంతో శ్రీలంక మహిళల జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 128 పరుగులు చేసింది. భారత బౌలర్లలో శ్రీచరణి 2 , వైష్ణవి శర్మ 2, క్రాంతి గౌడ్ , స్నేహరాణా ఒక్కో నికెట్ పడగొట్టారు. ఛేజింగ్‌లో భారత్ దూకుడుగా ఆడింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన తొలి వికెట్‌కు 29 పరుగులు జోడించగా.. మంధాన 14 రన్స్ కు వెనుదిరిగింది. అయితే ఫామ్‌లో ఉన్న షెఫాలీ, జెమీమా రోడ్రిగ్స్ దుమ్మురేపారు.
లంక బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 27 బంతుల్లోనే 58 పరుగులు జోడించారు. జెమీమా 26 రన్స్‌కు ఔటైనా.. షెఫాలీ దూకుడు తగ్గలేదు. హర్మన్ ప్రీత్ 10 పరుగులకు ఔటైన తర్వాత రిఛా ఘోష్‌తో కలిసి షెఫాలీ జట్టు విజయాన్ని పూర్తి చేసింది. షెఫాలీ దూకుడుతో భారత్ 11.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. షెఫాలీ వర్మ 34 బంతుల్లోనే 11 ఫోర్లు,1 సిక్సర్ తో 69 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ లో భారత మహిళల జట్టు 2---0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌లో తర్వాతి మ్యాచ్ శుక్రవారం తిరువునంతపురంలో జరుగుతుంది.