08-08-2025 01:38:48 AM
మహబూబాబాద్, ఆగస్టు 7 (విజయ క్రాంతి): వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు, రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులను, ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు వివరిస్తూ అన్నదాతకు అండదండగా నిలిచేందుకు వ్యవసాయ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 2020 సంవత్సరంలో రైతు వేదికలను ఏర్పాటు చేసింది.
5 వేల హెక్టార్ల భూమికి ఒక క్లస్టర్ గా నిర్ణయించి రైతు వేదికను ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. ఆ మేరకు 20 నుండి 25 లక్షల రూపాయల వ్యయంతో ఒక్కో క్లస్టర్ లో రైతు వేదికలను నిర్మించారు. క్లస్టర్ కు ఒక్కో ఎంఈఓ ను నియమించి రైతు వేదికలను రైతులకు అందుబాటులోకి తెచ్చారు. అయితే ఈ ఐదు సంవత్సరాల వ్యవధిలో కేవలం ఒక్కసారి మాత్రమే మూడు నెలల నిర్వహణ కోసం డబ్బులు ఇచ్చి చేతులు దులుపుతున్నారు.
ఆ తర్వాత రెండేళ్లుగా నిర్వహణ కోసం చిల్లిగవ్వ చెల్లిం చకపోవడంతో వ్యవసాయశాఖ అధికా రులు, క్లస్టర్ ఏఈఓ రైతు వేదికల నిర్వ హ ణ గుదిబండగా మారింది. రైతు వేదికలను కనీసం ఊడ్చే వారు కూడా లేకపోవడంతో క్లస్టర్ ఏ ఈ ఓ లు , మండల కేంద్రంలో వ్యవసాయ అధికారులకు కష్టంగా మారింది. సంబంధిత గ్రామపంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది చేత అప్పుడప్పుడు శుభ్రం చేయిస్తూ కాలం నెట్టుకొస్తున్నారు.
లేదంటే మరికొందరు తమ చేతి నుండి డబ్బులు చెల్లించి వారానికోసారి శుభ్రం చేయిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల వ్యవసాయ శాఖ అధికారులు తమ జేబు నుండి నెలకు కొంత చెల్లిస్తూ రైతు వేదికల నిర్వహణకు ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నారు. ఇదిలా ఉంటే మైనర్ రిపేర్లు, నీటి సరఫరా, విద్యుత్ బిల్లు బకాయిలు చెల్లింపు చేసే పరిస్థితి లేదు. నిర్వహణ కోసం ఏడాదికి కొంత బడ్జెట్ ఇవ్వకపోవడంతో రైతు వేదికల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.
పలుచోట్ల నీటి వసతి కోసం ఏర్పాటు చేసిన ట్యాంకు పైపులైన్లను కోతులు పాడు చేయగా తిరిగి మరమ్మత్తు చేసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో టాయిలెట్లు వినియోగించుకునే పరిస్థితి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యక్రమాలను రైతు వేదికలను వినియోగిస్తున్నారు. అయితే శాఖలు రైతు వేదికలను వినియోగించు కున్నప్పటికీ నిర్వహణ కోసం సహాయం చేయడం లేదు.
కరెంట్ బిల్లు భారం
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 82 రైతు వేదికలు ఉండగా, 52 రైతు వేదికల్లో రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వివరించేందుకు వీడియో కాన్ఫరెన్స్ (వీసీ) కోసం పెద్ద స్క్రీన్ టీవీ, దృశ్య శ్రవణ పరికరాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా రైతులకు శాస్త్రవేత్తలు, నిపుణులు ఆధునిక సాగు పద్ధతులపై దృశ్య మాధ్యమంలో వివరించడానికి ఏర్పాటు చేశారు. దీనివల్ల ఆయా రైతు వేదికలకు విద్యుత్తు కనెక్షన్లు తీసుకున్నారు. అయితే ఇప్పటివరకు బిల్లులు చెల్లించకపోవడంతో ఒక్కో రైతు వేదిక పది నుంచి 15 వేల వరకు విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి.
అటెండర్ ను నియమించాలి
వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం, ఆ కార్యక్రమంలో కీలకంగా మారిన రైతు వేదికల నిర్వహణ కోసం అటెండర్ లను నియమించాలి. అలాగే ప్రతినెల నిర్వహణ కోసం కొంత బడ్జెట్ కేటాయించాలి. ఏడాదికి లేదంటే రెండేళ్లకోసారి మరమ్మత్తులు, ఇతర పరికరాల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. అప్పుడే రైతు వేదికలు రైతులకు దీర్ఘకాలం ఉపయోగపడే విధంగా ఉంటాయని అన్నదాతలు చెబుతున్నారు.
నిర్మించారు..వదిలేశారు..!
కేసముద్రం మండలం మహముద్ పట్నం గ్రామంలో నిర్మించిన రైతు వేదికను నిరుపయోగంగా వదిలేశారు. 22 లక్షల రూపాయల వ్యయంతో 2020 సంవత్సరంలో రైతు వేదిక భవనాన్ని నిర్మించారు. అప్పటి నుండి ఇప్పటివరకు అక్కడ ఏలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. గ్రామానికి దూరంగా అడవిలో నిర్మించడం వల్ల అటు అధికారులు, ఇటు రైతులకు అందుబాటులో లేకుండా పోయింది. ఒక్కనాడు మీటింగ్ పెట్టింది లేదు. దీనివల్ల నిధులు వృధా తప్ప ప్రయోజనం లేకుండా పోయింది.
బద్దుల తిరుపతి, రైతు, మహమూద్ పట్నం