30-12-2025 01:24:07 AM
విక్రయించిన, వినియోగించిన పోలీసులకు సమాచారం ఇవ్వాలి
సిద్దిపేట, డిసెంబర్ 29 (విజయక్రాంతి):పతంగి ఎగరవేయడం అనేది శతాబ్దాలుగా భారతీయ సంస్కృతిలో భాగమై న ఆనందకరమైన వినోదం. ముఖ్యంగా సంక్రాంతి, ఉగాది వంటి పండుగల సమయంలో ఆకాశం రంగురంగుల పతంగులతో నిండిపోతుంది. అయితే ఇటీవలి కాలంలో పతంగి ఎగరవేయడానికి విస్తృతంగా ఉపయోగిస్తున్న చైనా మంజా దారం ఈ ఆనందాన్ని ప్రాణాంతక ప్రమాదంగా మార్చేస్తోంది.
గ్లాస్ పొడితో...
చైనా మంజా అనేది నైలాన్ లేదా సింథటిక్ దారంపై గ్లాస్ పొడి, రసాయనాలు పూసి తయారు చేసిన అత్యంత పదునైన దారం. దీని ప్రధాన లాభంగా పతంగి పోటీల్లో పైచేయి సా ధించడం చెప్పుకోవచ్చు. ఇతరుల పతంగుల దారాన్ని సులభంగా కోయగలగడం వల్ల యువతలో ఇది వేగంగా ప్రాచు ర్యం పొందింది. కొంతమంది వ్యాపారులు దీన్ని తక్కువ ఖర్చుతో, ఎక్కువ లాభాలతో విక్రయించడం మరో కారణం.
కానీ ఈ లాభాల వెనుక దాగిన నష్టాలు మాత్రం భయంకరమైనవి. చైనా మంజా కారణంగా ప్రతి ఏడాది అనేకమంది ద్విచక్రవాహనదారులు, పాదచారులు, చిన్నపిల్లలు తీవ్ర గాయాలకు గురవుతున్నారు. గొంతు కోసుకుపోవడం, చేతు లు తెగిపోవడం వంటి సంఘటనలు తరచూ వార్తల్లో కనిపిస్తున్నాయి.
పక్షులకు మరింత ప్రమాదం...
పక్షులకు ఇది మరింత ప్రాణాంతకంగా మారింది. ఆకాశంలో స్వేచ్ఛగా విహరించే పక్షులు ఈ దారానికి చిక్కి రెక్కలు విరిగి, ప్రాణాలు కోల్పోతున్నాయి.పర్యావరణానికి కూడా చై నా మంజా పెద్ద ముప్పే. ఇది కరుగని పదార్థం కావడంతో నే లపై, చెట్లపై చిక్కుకుని దీర్ఘకాలం కాలుష్యాన్ని కలిగిస్తుంది. విద్యుత్ తీగలపై పడితే షార్ట్ సర్క్యూట్లు, విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు చైనా మంజాపై నిషేధం విధించినా, వ్యాపారులు స్వార్థం కోసం వి చ్చలవిడిగా విక్రయిస్తున్నారు. సంప్రదాయ పత్తి దారాన్ని ఉపయోగించడం, సురక్షితంగా పతంగి ఎగరవేయడం ప్రతి పౌ రుడి బాధ్యత. వినోదం మనిషికి ఆనందం ఇవ్వాలి గానీ, ఇతరుల ప్రాణాలకు ముప్పుగా మారకూడదు.
సింథటిక్ దారాలను అమ్మినా, నిల్వ చేసినా చర్యలు...
జిల్లాలోని వ్యాపారులు సింథటిక్ దారాలను నిల్వ చేసిన, విక్రయించిన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా పో లీస్ కమిషనర్ విజయ్ కుమార్ హుకుం జారీ చేశారు. పర్యావరణ హితమైన కాటన్ దారాలను మాత్రమే అందుబాటులో ఉంచాలని రానున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లాలో నిషేధిత నైలాన్, సింథటిక్ మాంజా (చైనా మాంజా) దారాలను అమ్మినా, నిల్వ చేసినా లేదా వినియోగించినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పర్యావరణా నికి ముప్పుగా మారిన ఈ దారాలు చెట్లకు చుట్టుకుని పక్షుల కాళ్లు, రెక్కలు తెగిపోవడానికి, అలాగే పశువులు గాయపడటానికి కారణమవుతున్నాయని జిల్లాలోనీ పోలీసులు తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని దుకాణాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా నిషేధిత మాంజా విక్రయాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
దుకాణాల్లో తనిఖీలు
సిద్దిపేట పట్టణంలోని వివిధ గాలిపటాలు, మాంజా విక్ర య కేంద్రాల్లో వన్ టౌన్, టూటౌన్ ఇన్స్పెక్టర్లు వాసుదేవరావు, ఉపేందర్ లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దుకా ణదారులు నిషేధిత చైనా మాంజాను విక్రయించరాదని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించి విక్రయాలు జరిపితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు,షాపుల లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. చైనా మంజా విక్రయించిన, వినియోగించిన 8712667311, 8712667314 ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.