calender_icon.png 23 July, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పింగిళి కళాశాలలో దాశరథి శత జయంతి వేడుకలు

22-07-2025 07:50:28 PM

ప్రిన్సిపల్ లెఫ్ట్నెంట్ ప్రొఫెసర్ బి. చంద్రమౌళి..

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ & పీజీ కళాశాల(Pingle Government Womens Degree & PG College) వడ్డేపల్లి హనుమకొండలో మంగళవారం తెలుగువిభాగం ఆధ్వర్యంలో దాశరథి కృష్ణమాచార్య శత జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ లెఫ్టినెంట్ ప్రొఫెసర్ బి. చంద్రమౌళి, తెలుగు విభాగాధిపతి ఎస్ మధుల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దాశరథి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

వారు మాట్లాడుతూ.. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరుకు చెందిన కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్య నిజాం రాజును ఎదిరిస్తూ రచనలు చేశారనీ, తెలంగాణ విముక్తి కోసం కృషి చేశారని, "నా తెలంగాణ కోటి రత్నాల వీణ" అని సగర్వంగా ప్రకటించి, తెలంగాణ ఉద్యమానికీ ప్రేరణనందించారని ఎన్నో సినిమా పాటలను రచించి, సాహితీ గౌరవం తీసుకొచ్చారని, ఇలాంటి గొప్ప కవులను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు కూడా రచనలు చేయాలని ఆకాంక్షించారు.

జీవిత విశేషాలను, రచనల గూర్చి సమగ్రంగా తెలిపి, ప్రతి సంవత్సరం దాశరథి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సాహిత్యరంగంలో కృషిచేసిన వారికి తెలంగాణ ప్రభుత్వం దాశరథి సాహిత్య పురస్కారం అందజేస్తోందని అన్నారు .కార్యక్రమంలో అధ్యాపకులు రామా రత్నమాల, బి. సునీత, డా.రాజు, వైష్ణవి, విద్యార్థినులు పాల్గొన్నారు. కార్యక్రమానంతరం నిర్వహించిన ఉపన్యాస పోటీలో శృతి, శ్రీవల్లి, పావని లకు ప్రిన్సిపాల్ బహుమతులు అందించారు.