22-07-2025 07:53:45 PM
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్..
మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వం కల్పిస్తున్న స్వయం ఉపాధి పథకాలను యువత అందిపుచ్చుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(District Collector Adwait Kumar Singh) పిలుపునిచ్చారు. కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ టీ- ప్రైడ్ స్కీమ్ ద్వారా జిల్లాలో షెడ్యూల్ ట్రైబ్ కేటగిరిలో 24 మందికి 82.40 లక్షలు, ఎస్సీ కేటగిరిలో ఇద్దరికీ 7.28 లక్షల రూపాయల నిధుల కేటాయింపులో లబ్ధిదారులకు సబ్సిడి రాయితీ మంజూరు చేయడం జరిగిందన్నారు. తెలంగాణ ఐ పాస్ ద్వారా 12 యూనిట్లుకి, 24.29. కోట్ల పెట్టుబడితో అనుమతులు పొందాయన్నారు.
కేసముద్రం, గూడూరు, నెల్లికుదురు, మహబూబాబాద్, మరిపెడ, తొర్రూరు మండలాల్లో రైస్ మిల్లులు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు వచ్చాయన్నారు. పరిశ్రమల శాఖ ద్వారా రాష్ట్రంలోని యువతకు ప్రైవేట్ ఇండస్ట్రీలలో ఉపాధి కల్పించుటకు డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణను ప్రారంభించడం జరిగిందని, ఈ పథకం అమలు కోసం జిల్లా స్థాయి కమిటీని నియమించడం జరిగిందన్నారు. ఈ కమిటీ ద్వారా డిట్ ఆన్లైన్ ప్లాట్ఫారం గురించి యువతలో అవగాహన కల్పించి, ఉద్యోగ అవకాశాల కోసం పోర్టల్ లో నమోదు చేయించాలని, యువత ఈ పథకం ద్వారా ఉపాధి అవకాశాలు పొంది ఆర్థిక అభివృద్ధి పొందాలని సూచించారు.
తెలంగాణ గేట్ వే ఆఫ్ అడాప్ట్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయిమెంట్ పథకంలో నూతనంగా ప్రవేశ పెట్టడం జరిగిందని, అందుకు కావలసిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ డిట్ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ పథకం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ మధుసూదన రాజు, జిల్లా పరిశ్రమల శాఖ జిఎం శ్రీమన్నారాయణ రెడ్డి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి దేశీరామ్, ఎస్సి కార్పొరేషన్ ఈడి శ్రీనివాస్ రావు, ఆర్టీవో జైపాల్ రెడ్డి, లీడ్ బ్యాంకు మేనేజర్ యాదగిరి, ఎంప్లాయిమెంట్ అధికారి రజిత, పట్టణ ప్రణాళిక అధికారి సాయిరాం, ఫ్యాక్టరీస్ వెంకటరమణ, సుభాష్, సాయిరామ్, మహేష్, సంబధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.